అన్నయ్య డైరెక్షన్‌లో తమ్ముడు ఇంకోసారి

పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో సాయిరాం శంకర్‌ హీరోగా ‘143’ అనే సినిమా వచ్చింది. తన వద్ద అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పని చేసిన తన తమ్ముడు సాయిరాం శంకర్‌ని హీరోగా నిలబెట్టేందుకు పూరి జగన్నాథ్‌ చేసిన సినిమా అది. అయితే సాయిరాం శంకర్‌ అవకాశాలైతే దక్కించుకుంటున్నాడుగానీ హిట్లే అతని దరిచేరడంలేదు. ఒక్కటంటే ఒక్కటే హిట్‌ ఉంది సాయిరాం శంకర్‌ కెరీర్‌లో. అదే ‘బంపర్‌ ఆఫర్‌’.

తాజాగా ‘నేనోరకం’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ సినిమా తర్వాత పూరి డైరెక్షన్‌లో సాయిరాం శంకర్‌ హీరోగా ఇంకో సినిమా రాబోతోందట. పూరి సొంత బ్యానర్‌ వైష్ణో అకాడమీపై ఈ చిత్రం రూపొందనుందని సమాచారమ్‌.

అలాగే సాయిరాం శంకర్‌కి డైరెక్షన్‌ చేయాలనే ఆలోచన కూడా ఉందట. ఎలాగూ అన్నయ్య దగ్గర అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పని చేసిన అనుభవం ఎలాగూ ఉంది. ఆ అనుభవంతోనే ఒక చిన్న హీరోతో మంచి లవ్‌ స్టోరీని తెరకెక్కిచాలనే తపనతో ఉన్నాడట సాయిరాం శంకర్‌. హీరోగా తాను చేయాల్సిన అన్ని ప్రయత్నాలు అయిపోయాక, ఇక హీరోగా నిలదొక్కుకోలేని పరిస్థితి వస్తే అప్పుడు డైరెక్షన్‌ ట్రై చేస్తానంటున్నాడు. దానికోసం మళ్ళీ అన్నయ్యదగ్గరే కొన్నాళ్ళు వర్క్‌ చేస్తాడట సాయిరాం శంకర్‌. అంటే సాయిరాం శంకర్‌ మెగాఫోన్‌ పట్టేసే అవకాశాలు తొందరలోనే ఉన్నాయని భావించవచ్చన్న మాట.