సునీల్‌ని భయపెడ్తున్న చెల్లి సెంటిమెంట్‌ 

తాజాగా సునీల్‌ నటించిన ‘కృష్ణాష్టమి’ సినిమా పరాజయం పాలైంది. ఆ సినిమాలో ముద్దుగుమ్మ సంజన చెల్లెలు నిక్కీగల్రాని హీరోయిన్‌గా నటించింది. నటన, డాన్సుల పరంగా ఆమె ఓకే అన్పించినా, కానీ సునీల్‌కు ఆమెతో జోడీ విజయాన్ని అందించలేదు. ఇప్పుడు సునీల్‌ ‘జక్కన్న’ సినిమాతో వస్తున్నాడు. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా చెల్లెలు మనారా చోప్రా హీరోయిన్‌గా నటిస్తోంది. అదేంటో హీరోయిన్స్‌ చెల్లెళ్లతో వరుస పెట్టి అవకాశాలు దక్కుతున్నాయి సునీల్‌కు. అయితే మొదటి కాంబినేషన్‌ ఫెయిల్‌ అయ్యింది. ఇప్పుడు రాబోతున్న ఈ కాంబినేషన్‌ ఎంత వరకూ వర్కవుట్‌ అవుతుందో చూడాలి.

నిజానికి మనారా, ప్రియాంకకు సొంత చెల్లెలు కాదు కాబట్టి ఈ కాంబినేషన్‌ వర్కవుట్‌ అవుతుందేమో చూడాలి. అదీ కాక ‘జక్కన్న’ సినిమాకి రెస్పాన్స్‌ బాగా వస్తోంది. సినిమా ట్రైలర్‌, టీజర్‌లతో ఇప్పటికే సునీల్‌ బాగా ఎట్రాక్ట్‌ చేస్తున్నాడు. హిట్‌ కొట్టే కళలు ఈ సినిమాకి బాగా కనిపిస్తున్నాయి. సునీల్‌, మనారా కెమిస్ట్రీ స్క్రీన్‌పై బాగా కుదిరింది. కమెడియన్‌ పృద్వీ పోలీస్‌ గెటప్‌లో కామెడీ అదరగొట్టేశాడు. సునీల్‌, సప్తగిరి పంచ్‌ డైలాగులు కుమ్మేస్తున్నారు. ఇవన్నీ వెరసి ఈ సినిమాకి మెగాస్టార్‌ చిరంజీవి ఆశీస్సులు మెండుగా ఉన్నాయి. దాంతో సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. మొత్తానికి ఈ సినిమాతో హీరో సునీల్‌ మరో హిట్‌ కొట్టాలని ఆశిద్దాం.