రాజుగాడు యమ డేంజర్!

చిన్న సినిమాలతో మంచి విజయాలు సొంతం చేసుకుంటున్నాడు రాజ్ తరుణ్. ఈ యువహీరో లేటెస్ట్‌గా రెమ్యునరేషన్ పెంచాడని సమాచారం. అయినప్పటికీ అతడిని అవకాశాలు వరిస్తున్నాయి. రాజ్‌ తరుణ్‌ ప్రస్తుతం నాలుగు సినిమాలను అంగీకరించాడు. వీటిలో రెండు సినిమాలను అనిల్ సుంకర నిర్మించనున్నారు. ఆ రెండింటిలో ఒకదానికి దర్శకుడు మారుతి మరో ప్రొడ్యూసర్‌గా ఉన్నాడు. మారుతి కథ . . స్క్రీన్ ప్లే అందించే ఈ సినిమాకి సంజన దర్శకత్వం వహించనున్నట్టు తెలుస్తోంది.

సంజన డైరక్ట్‌ చేసే సినిమాకి ‘రాజుగాడు’ అనే టైటిల్ ను, ‘యమా డేంజర్’ అనే ట్యాగ్ లైన్ ను పెట్టారు. ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని విషయాలను నిర్మాత అనిల్ సుంకర వెల్లడించారు. రాజ్ తరుణ్ స్టైల్‌కి ‘రాజుగాడు’ కథ సరిగ్గా సరిపోతుందని చెప్పారు. మారుతి కథ.. స్క్రీన్ ప్లే అద్భుతంగా ఉన్నాయని.. ఆయనతో కలిసి ఈ సినిమాను నిర్మించడం ఆనందంగా ఉందని చెప్పారు. యూత్ ఆశించే స్థాయిలో ఈ సినిమా ఉంటుందని అన్నారు.