రజినీకాంత్ కంటే అక్షయ్ కే ఎక్కువా!!!

కేవలం రజనీ సినిమాలోనే కాదు.. అవకాశాలొస్తే దక్షిణాదిలో మరిన్ని సినిమాలు చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని అంటున్నాడు అక్షయ్ కుమార్. ప్రస్తుతం రజనీకాంత్, శంకర్ ల “2.0’లో నటిస్తున్న అక్షయ్ సౌతిండియా తనకు తెగ నచ్చేసిందని అంటున్నాడు. రజనీ సార్ సినిమాలో విలన్ గా నటించడం మరిచిపోలేని అనుభవం అని అక్షయ్ చెబుతున్నాడు. బాలీవుడ్ లో హీరోగా నటిస్తూ.. సౌత్ లో విలన్ గా చేయడం పట్ల తనకు అభ్యంతరం ఏమీ లేదని అక్షయ్ కుమార్ చెప్పాడు.సౌత్ లో ఇలాంటి పాత్రలు మరిన్ని చేయడానికి తాను సిద్ధమని ప్రకటించాడు అక్షయ్. విలన్, క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలు చేయడానికి తాను ఉత్సాహంతో ఉన్నానని ప్రకటించాడు. మరి అక్షయ్ కుమార్ ఈవిధమైన ఆసక్తి చూపడం విశేషమే. ఈ బాలీవుడ్ హీరోని సౌత్ సినిమాల్లో నటింపజేయడం ద్వారా ఇక్కడి ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇవ్వడంతో పాటు.. ఈయన నటించిన సౌత్ సినిమాలను హిందీలో కూడా విడుదల చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది.

అయితే ఇక్కడ ఒక తిరకాసు ఉంది. అక్షయ్ కుమార్ పారితోషకం అల్లాటప్పా స్థాయిలో లేదు. రోబో సీక్వెల్ విషయంలో రజనీకాంత్ కు ధీటుగా.. ఆయన కన్నా ఎక్కువ పారితోషకాన్ని అక్షయ్ కుమారే పొందాడనేది టాక్. మరి అక్షయ్ కి అంత సొమ్ములు చెల్లించి నటింపసేసుకోవాలంటే బడ్జెట్ పరిమితులు దాటిపోవడం ఖాయం. మహేశ్ బాబు- మురగదాస్ కాంబో సినిమా విషయంలో కూడా అక్షయ్ పేరు ప్రస్తావనకు వచ్చింది. విలన్ గా అక్షయ్ అయితే బాగుంటుందని అనుకున్నారట. చివరకు ఎందుకు తగ్గారో కానీ.. మళ్లీ ఎస్ జే సూర్య నే ఆ పాత్రకు కన్ఫర్మ్ చేసుకున్నారు. మరి అక్షయ్ స్థాయి పారితోషకాన్ని ఇచ్చి ఆయనను తీసుకొనేదెవరు?