ముద్రగడ ఏం సాధించారు?

కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం దీక్ష విరమణతో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఊపిరి పీల్చుకుంది. నిరాహార దీక్ష ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తుందోనని చంద్రబాబు సర్కార్‌ ఇప్పటిదాకా ఆందోళనతో ఉండేది. ఇప్పుడు ఆ ఆందోళన అక్కర్లేదు. దీక్ష విరమించడం కూడా నాటకీయ పరిణామాల మధ్యనే జరిగింది. అయితే దీక్షతో ముద్రగడ పద్మనాభం ఏం సాధించారు? అని కాపు సామాజిక వర్గం ఇప్పుడు ప్రశ్నించుకుంటోంది. కేసులు నమోదు కావడం, అరెస్టవడం, బెయిల్‌ రావడం ఇదంతా ఓ ప్రక్రియ. పద్ధతి ప్రకారమే అంతా జరిగింది. ఇందులో ప్రభుత్వ జోక్యానికి అవకాశమే లేదు. రైలు తగలబడింది, కేసులు నమోదయ్యాయి, అరెస్టులు జరగడం, బెయిల్‌ కోసం నిందితులు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే వారు కోరుకున్నట్లు బెయిల్‌ లభించడం జరిగాయి. బెయిల్‌ లభించాక నిందితులు అరెస్టయ్యారు. దీనికోసమేనా ముద్రగడ దీక్ష? దీక్ష చేయకపోయినా వారికి బెయిల్‌ వచ్చేది, మరెందుకు ముద్రగడ దీక్ష చేసినట్లు? అని కాపు నాయకులే ఆశ్చర్యపోతున్నారు. 14 రోజులపాటు ముద్రగడ పద్మనాభం రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికే పరిమితమయ్యారు. పోలీస్‌ బందోబస్తు, సామాన్య రోగుల ఇబ్బందులు ఇవన్నీ చోటుచేసుకున్నాయి. కథ సుఖాంతం అయ్యిందని ప్రభుత్వం అనుకుంటుండగా, ముద్రగడ దీక్షతో ఉపయోగం లేదని కాపు నాయకులు ఒప్పుకుంటున్నారు.