భర్త వేధింపులు తాళలేక..రేప్ స్టోరీ అల్లుకుంది..

ఆమె ఓ నర్సు. ముంబైలోని థానే హాస్పిటల్ లో ఉద్యోగం చేస్తోంది. మంచి జీతమే. కానీ ఇంట్లో పరిస్థితే బాలేదు. భర్త వేధింపులు. కొడుకు తమవాడే కాబట్టి కుటుంబసభ్యులదీ అతని మాటే. నిత్యం గొడవలు. ప్రశాంతత లేదు. మొత్తానికి 26ఏళ్లకే ఆమె జీవితంపై నిరాశ పెంచుకుంది. చనిపోవాలని అనుకోకపోయినా ఈ గొడవలను తప్పించుకోడానికి ఓ ప్లాన్ వేసుకుంది. ఇలా చెప్తే వేధించకుండా వదిలేస్తారనుకుందో ఏమో గానీ తనపై కొందరు అత్యాచారం చేశారని ఇంట్లో చెప్పింది.

హాస్పిటల్ నుంచి ఇంటికి వస్తుండగా ఆటో ఎక్కానని, ఆటో డ్రైవర్ తనకు క్లోరోఫామ్ వాసనచూపించి స్పృహకోల్పోయేలా చేశాడని ఇంట్లో చెప్పిందామె. ఆటో డ్రైవర్ తో పాటూ అతనితోనే ఉన్న మరో ఇద్దరు తనపై అత్యాచారం చేశారని కన్నీటిపర్యంతమైంది. ఈ విషయాన్ని భర్తతో కలిసి పోలీస్ స్టేషన్ లోనూ ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమె చెప్పిన ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించారు. అయితే మహిళ చెప్పిన టైమ్ లో ఒక్క ఆటో కూడా అటుగా రాలేదు. వైద్య పరీక్షల్లోనూ ఆమెపై అత్యాచారం జరగలేదని తేలింది. దీంతో ఆమెను ప్రశ్నించగా అసలు విషయం బయటపెట్టింది.

భర్త, అతని కుటుంబసభ్యుల టార్చర్ తాళలేకే ఈ కట్టుకథ అల్లినట్లు బాధితురాలు పోలీసులకు వివరించింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఇరువురికీ కౌన్సిలింగ్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడించలేమని..ఇదో వ్యక్తిగత సమస్యగా డీల్ చేస్తున్నామని అధికారులు తెలిపారు.