కాపుల ఉద్యమానికి ఇక KCR ఆయుధం!!

తెలంగాణ రాష్ట్రం కోసం వివిధ వ్యూహాలు రచించి చివరకు అనుకున్నది సాధించిన ఉద్యమ నేతల ఎత్తుగడను కాపునేతలు అనుసరించనున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో టీఆర్‌ఎస్‌పై ఎవరు విమర్శలు చేసినా, వారిపై తెలంగాణ ద్రోహుల ముద్ర వేయడం ద్వారా ప్రత్యర్ధులను కట్టడి చేసిన టీఆర్‌ఎస్ ముక్యంగా KCR వ్యూహాన్ని, ఏపిలో కాపు నేతలు కూడా అనుసరించేందుకు సిద్ధమవుతున్నారు.

కాపులను బీసీల్లో చేర్పించాలంటూ దీక్షలు నిర్వహిస్తున్న ముద్రగడ పద్మనాభంపై తెలుగుదేశం నాయకత్వం మాటల దాడులు చేస్తోంది. అదే సమయంలో టిడిపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న బిజెపి నేతలయిన కన్నా లక్ష్మీనారాయణ, సోము వీర్రాజుపైనా ఎదురుదాడి చేస్తోంది. ఈ ఎదురుదాడికి టిడిపికి చెందిన కాపునేతలనే వినియోగిస్తోంది. ఏపి టిడిపి అధ్యక్షుడు కళా వెంకట్రావు, మంత్రులు గంటా శ్రీనివాసరావు, నారాయణ, కాపు కార్పొరేషన్ చైర్మన్ రామానుజయ, ఎమ్మెల్యే బొండా ఉమా, జ్యోతుల నెహ్రు, తోట త్రిమూర్తులు తదితరులను ముందుపెట్టి.. వారితోనే ముద్రగడ, ఇతర పార్టీల్లో టిడిపి విమర్శకులపై ఎదురుదాడి చేయిస్తోంది. చివరకు టిడిపి కాపు నేతలు ముద్రగడకు మద్దతునిస్తున్న కాపుసంఘాలు, పార్టీలపైనా విరుచుకుపడుతున్నారు. కమ్మ సామాజికవర్గం తమ వర్గంపై సోషల్ మీడియాలో చేస్తున్న దుష్ప్రచారంపైనా కాపుజాక్ దృష్టి సారించింది. ముద్రగడ దీక్షను విమర్శిస్తూ, ఆయనకు ప్రశ్నలు సంధించిన వైనం వాట్సాప్, ఫేస్‌బుక్‌లో హల్‌చల్ చేస్తోంది. దానికి కాపువర్గం కూడా అదే స్ధాయిలో ఎదురుదాడి చేస్తుండటంతో సోషల్ మీడియాలో జరుగుతున్న కమ్మ-కాపు యుద్ధం పతాక స్థాయికి చేరినట్టయింది. సొంత కులం వారితో సొంత కులం వారిపై ఎదురుదాడి చేయిస్తూ, విభజించి పాలిస్తున్న బాబు వ్యూహానికి విరుగుడు ఆలోచించాలని కాపుజాక్ చాలారోజుల నుంచి కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా, ఇకపై ముద్రగడతో పాటు, వివిధ పార్టీల్లో ఉన్న కాపు నేతలను విమర్శించే టిడిపి కాపు నేతలను కుల బహిష్కరణ చేయాలని, వారిని కాపు ద్రోహులుగా ప్రకటించాలన్న నిర్ణయానికి వచ్చారు.

తెలంగాణా ఉద్యమ సమయం లో తెరాస అంటే తెలంగా, తెలంగాణా అంటే తెరాస అన్నంతగా బలపడిపోయింది తెరాస.వారికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వాళ్ళు తెలంగా ద్రోహులే.తెరాస ని కాని KCR ని కాని పల్లెత్తు మాట అనాలన్న బెంబెలెత్తిపోయేవారు. సరిగ్గా కాపు ఉద్యమానికి కుడా ఇదే సూత్రాన్నిఆపాదించి కాపుద్రోహుల ముద్ర వేసే తద్వారా ప్రభుత్వ విమర్శల్ని తిప్పి కొట్టాలని కాపుజాక్ ఆలోచిస్తోంది.