ఆంధ్ర గజనీగా మారుతున్న చంద్రబాబు!!

అన్న మన అధినేతెంటి ఇలా చేస్తున్నారేంటి..? అన్నో మన సారుకు గతాన్ని గుర్తుచేయాలి.. అదేం కాదయ్యా మన సారు మరో గజినీగా మారారు. ఇవి ఎవరి మాటలు అనుకుంటున్నారా.. ఆంద్రప్రదేశ్ తెలుగు తమ్ముళ్ల చర్చలు.., ఈ మద్య ఇలాగే ఉంటున్నాయి. అసలు వాళ్లు ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారు అనుకుంటున్నారా? ఇంకెవరి గురించో కాదు సాక్షాత్తూ వాళ్ల అధినేత చంద్రబాబు గురించే..! ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రపంచదేశాల్లో గుర్తింపు పొందిన బాబు గజినీగా మారడం ఏంటి అనుకుంటున్నారా.. ఐతే ఇది చదవండి.

తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు గజినీగా మారుతున్నారు.ఆయనకు పాత విషయాలెవి గుర్తుకు రావడం లేదు. చరిత్ర ఆయన చెవులకెక్కడం లేదు. జ్జాపకాలను బాబుగారు తీసిపారేశారు. వర్తమానం, భవిష్యత్తు తప్ప ఆయనకు గతంతో పనిలేకుండా పోయింది. చెడామడా తనను తిట్టిన తిట్లను చంద్రబాబు ఎప్పుడో మరిచిపోయారు. కష్టాల్లో వదలివెళ్ళిన వారిని ఇప్పుడు మళ్ళీ ఆప్తమిత్రులుగా ఆదరిస్తున్నారు. పెద్ద మనిషిగా మారి ఆయన క్షమిస్తున్నారు. పెద్ద మనసు చేసుకొని అందరిని దగ్గరకు తీసుకుంటున్నారు. వచ్చిన వారిని కలుపుకుపోవడంపైనే ఆయన శ్రద్ధ. వారెవరన్నది ఆయనకు అనవసరం. పార్టీ కార్యకర్తల మనోభావాలు అవసరం లేదు. నాయకుల ఆవేదనతో ఆయనకు పనిలేదు. పార్టీ ఫిరాయింపులతో నైతిక విలువలకు స్థానం లేని రాజకీయాలు చిత్ర విచిత్రమైన మలుపులు తిరుగుతున్నాయి.

జగన్ ను చిత్తు చేయడమే ప్రధాన ఎజెండాగా ఆయన ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకుంటున్న చంద్రబాబు చరిత్రతో పనిలేకుండా వ్యవహారిస్తున్నారు. పార్టీని, నాయకుడిని నడిరోడ్డు మీద వదిలేసి, నోటికొచ్చినట్లు తూలనాడిన వారికి కూడా పసుపు కండువాలు కప్పి సాదారంగా ఆహ్వానిస్తున్నారు. తాజాగా ఆయన పలమనేరు శాసనసభ్యులు అమరనాథ్ రెడ్డిని పార్టీలో చేర్చుకున్న తీరు టీడీపీ కార్యకర్తలను విస్మయానికి గురిచేస్తోంది.

2009లో పలమనేరు నుంచి టీడీపీ తరుపున గెలిచిన అమర్నాథ్ రెడ్డి చంద్రబాబును ఏ రకంగా ఇబ్బంది పెట్టారో తెలుగు తమ్మళ్లకు ఇంకా గుర్తుంది. రాష్ట్రంలో తెలుగుదేశం పరిస్థితి బాగాలేదని గ్రహించిన అమరనాథ్‌ రెడ్డి చంద్రబాబుపైన తిరుగుబాటు చేసి జగన్ కు జై కొట్టారు. రెడ్డి సామాజికవర్గ లెక్కలు వేసుకొని వై.ఎస్.ఆర్.సి.పిలో చేరారు. ఈ సమయంలో టీడీపీ అధినేతపైన అమరనాథ్ రెడ్డి తీవ్ర విమర్శలకు దిగారు. మరో ఎమ్మెల్యే ప్రవీణ్ కుమార్ రెడ్డితో కలిసి ఆయన చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. అయితే 2014 ఎన్నికల్లో పలమనేరు నుంచి వైసీపీ తరుపున గెలిచిన అమర్ నాథ్‌రెడ్డి రెండేళ్లు కాక ముందే మళ్ళీ ప్లేట్ ఫిరాయించారు. ఈ సారి జగన్ కు వెన్ను పోటు పొడిచి చంద్రబాబు పంచన చేశారు. బాబు కూడా ఆయన చరిత్రను క్షమించేసి పసుపు కండువా కప్పేస్తున్నారు.

ఎమ్మెల్యేలను చేర్చుకోవడం ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో మామూలు వ్యవహారం. కాని ఇలాంటి వారిని కూడా చేర్చుకోవాలా అన్న చర్చ టీడీపీలో జరుగుతోంది.అయితే తెలంగాణలో తనను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిన వారికి గులాబీ కండువాలు వేస్తున్న కేసీఆర్ ను చంద్రబాబు ఆదర్శంగా తీసుకున్నట్లు కనిపిస్తోంది. తెలుగుదేశం నుంచి వెళ్ళిపోయి వేరే పార్టీలో చేరి ఆ తర్వాత తిరిగి మళ్ళీ వచ్చిన వారు చాలా మందే ఉన్నారు. ప్రస్తుత ఎపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు కూడా ఒకప్పుడు పార్టీని వీడి ప్రజారాజ్యంలో చేరిన వారే. ఇటీ వల తెలుగుదేశంలో చేరిన భూమా నాగిరెడ్డి,జ్యోతుల నెహ్రు,టీజీ వెంకటేష్ , గంటా శ్రీనివాసరావు, ఆనం సోదరులతో పాటు పలువురు ఎమ్మెల్యేలు టీడీపీకి పాతకాపులే. అయితే వీరు ఎన్నికలకు ముందో, కొత్త పార్టీలు పెట్టినప్పుడో వెళ్లిపోయిన వారు. కాని అమర్ నాథ్‌రెడ్డి లాగా శాసనసభ్యుడిగా ఉండి కష్టాల్లో ఉన్న పార్టీని మరింత కష్టాల్లోకి నెట్టి ప్రత్యర్థి పక్కన చేరిన వారు మాత్రం కాదు. ఇలాంటి చేరికలపైన తెలుగుదేశం కార్యకర్తల్లో ఆగ్రహం వ్యక్తమౌతోంది. ఇక అమర్ నాథ్‌రెడ్డి లాగానే 2009 ప్రారంభంలోనే చంద్రబాబుపైన తిరుగుబాటు చేసి వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి పక్కన చేరి రోజు తిట్టిపోసిన మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి కూడా పసుపు కండువా కప్పుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇవన్ని చూస్తుంటే తమ అధినేత గజినీలా మారిపోయారా అని తెలుగు తమ్ముళ్లు గుణుకుంటున్నారు.

అదికారమే పరమావదిగా మారిన ఈ రోజుల్లో స్వచ్చమైన రాజకీయాలను కోరుకోవడం ప్రజల అమయాకత్వం తప్ప ఇంకోటి కాదు, అందులో మన తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ విలువలు పాతాళానికి పడిపోయాయి. వీటిని ప్రజలు గుర్తించి గోడమీది పిల్లులకు బుద్దిచెప్పాల్సిన అవసరం ఎంతైన ఉంది.