గుంటూరులో వైసీపీకి ఐదు సీట్లు రావా… అధికార పార్టీలోనే హాట్ టాపిక్‌…!

గుంటూరు జిల్లా అంటేనే ఆంధ్రప్రదేశ్ కు గుండెకాయ లాంటిది. చంద్రబాబు అధికారంలో ఉన్న ఐదేళ్లలో గుంటూరు జిల్లా ఓ వెలుగు వెలిగింది. రాజధానిగా గుంటూరు జిల్లాలోని అమరావతి ని ఫిక్స్ చేయడంతో ఆ ప్రభావం గుంటూరు – కృష్ణా జిల్లాల పై ఎక్కువగా కనబడింది. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్న ఐదేళ్లలో ఇక్కడ రియల్ ఎస్టేట్ బూమ్ బాగా పుంజుకుంది. ఇంకా చెప్పాలంటే ఐదేళ్లలో దేశంలో ప్రధాన నగరాలను మించిన రేంజ్లో ఇక్కడ రియల్ బూమ్ ఉరుకులు పరుగులు పెట్టింది. రాజకీయమంతా గుంటూరు – విజయవాడ కేంద్రం గాని నడిచింది. ఎప్పుడు అయితే వైసీపీ అధికారంలోకి వచ్చి… రాజధాని వికేంద్రీకరణ అంశం తెర మీదకు తీసుకువచ్చిందో అప్పుడే గుంటూరు-విజయవాడ ప్రాభ‌వం ఒక్కసారిగా తప్పింది.

ఇక్కడ రియల్ ఎస్టేట్ కుప్పకూలడంతో పాటు ఆ ప్రభావం వ్యాపారాలపై పడింది. చంద్రబాబు ఎంత అభివృద్ధి చేసినా గత ఎన్నికల్లో ఈ రెండు జిల్లాల ప్రజలు తెలుగుదేశం పార్టీని చిత్తుగా ఓడించారు. ఈ రెండు జిల్లాల్లో టిడిపి కేవలం నాలుగు సీట్లతో సరిపెట్టుకుంది. ఎన్నికల తర్వాత గన్నవరంలో గెలిచిన వల్లభనేని వంశీ – గుంటూరు పశ్చిమంలో గెలిచిన మద్దాలి గిరి ఇద్దరు కూడా సైకిల్‌కు గుడ్బై చెప్పేశారు. ఇప్పుడు కృష్ణాలో ఒకరు… గుంటూరులో ఒకరు మాత్రమే టిడిపి ఎమ్మెల్యేలుగా ఉన్నారు.

ఎప్పుడు అయితే రాజధాని వికేంద్రీకరణ జరిగిందో… ఈ రెండు జిల్లాల్లో వైసిపి వీరాభిమానుల్లో కూడా జగన్ .. వైసీపీ ప్రభుత్వం పై తీవ్రమైన వ్యతిరేకత కనిపిస్తోంది. జగన్ తమను ఇలా నిలువునా ముంచేస్తారు అని తాము ఊహించలేదని వారు వాపోతున్నారు. దీనికితోడు రాజధాని మారిపోవటం… అభివృద్ధి మందగించటం… వ్యాపారాలు కుప్పకూలడంతో ఈ రెండు జిల్లాల ప్రజల్లో ప్రభుత్వంపై ఎక్కువగా వ్య‌తిరేక‌త కనిపిస్తోంది. దీనికితోడు అధికారపార్టీ ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో అభివృద్ధిని మర్చిపోయి ప్రజలకు దూరంగా ఉంటూ కాలక్షేపం చేస్తున్నారు.

దీనికితోడు కరోనా రావడం కూడా కొంత ప్రభావం చూపింది. ఈ రెండేళ్లలో కూడా పెద్దగా మార్పులు వచ్చే పరిస్థితి లేకపోవడంతో పాటు…. అధికార పార్టీలో ఉన్న గ్రూపు క‌ల‌హాల‌ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో గుంటూరు జిల్లాలో వైసీపీ నాలుగైదు సీట్లలో మాత్రమే గెలుస్తుందని వైసీపీ వర్గాల్లోనూ… ఆ పార్టీ అభిమానుల్లోనూ చర్చ నడుస్తోంది. గుంటూరు తూర్పుతో పాటు పల్నాడులో ఉన్న 1 – 2 నియోజకవర్గాలు… మరో నియోజకవర్గంలో వైసీపీ గెలిస్తే గెలవచ్చు తప్ప… జిల్లాలో టీడీపీ బలంగా పుంజుకుంద‌న్న చర్చలు వినిపిస్తున్నాయి. మరోసారి రాష్ట్రంలో జగన్ ప్రభంజనం వీచిన కూడా గుంటూరు జిల్లాలో మాత్రం ఈసారి వైసీపీకి ఆధిక్య‌త వ‌చ్చే ఛాన్సులు లేవు.