తెలంగాణ బీజేపీకి బీసీలు దూరం దూరం… విక్ర‌మ్ త‌ర్వాత నెక్ట్స్ ఎవ‌రో…!

బీసీలకు తాము వెలుగు రేఖ‌గా మార‌తామ‌ని.. బీసీల‌కు ద‌న్నుగా నిలుస్తామ‌ని ప‌దే పదే చెబుతున్న బీజేపీ.. అదే బీసీల‌ను దూరం చేసుకుంటున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. తాజాగా తెలంగాణ రాజ‌కీయాల్లో కీల‌క‌మైన యువ నాయ‌కుడిగా గుర్తింపు ఉన్న బీసీ సామాజిక వ‌ర్గానికి చెందిన విక్ర‌మ్ గౌడ్‌ను పార్టీ దూరం చేసుకుంది. పార్టీకి ఆయ‌న రిజైన్ చేశారు. ఈ విష‌యాన్ని తేలిక‌గా చూసే అవ‌కాశం లేదు. ఎందుకంటే.. మ‌రో రెండు మాసాల్లోనే కీల‌క‌మైన పార్ల‌మెంటు ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి.

ఈ నేప‌థ్యంలో బీజేపీ పెద్ద‌లు నిర్దేశించుకున్న ల‌క్ష్యం సాధించాలంటే.. తెల‌గాణ‌లో బీసీల‌కు చేరువ కావా ల్సి ఉంది. బ‌హుశ‌.. అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందు.. బీజేపీ ప‌ఠించిన బీసీ మంత్ర‌మే ఆ పార్టీని ఆ ఎన్నికల లో 8 స్థానాలు గెలుచుకునేలా చేసింద‌నే విశ్లేష‌ణ‌లు ఉన్నాయి. ఎన్నిక‌ల‌కు ముందు బీసీని ముఖ్య‌మంత్రిని చేస్తామంటూ.. ప్ర‌ధాని మోడీ ఇచ్చిన పిలుపు కొంత వ‌ర‌కు బాగానే ప‌నిచేసింది. ఇలాంటి ప‌రిస్థితి నుంచి పార్టీని మ‌రింత బలోపేతం చేసుకునేందుకు బీసీల‌ను మ‌రింత‌ అండ‌గా నిల‌వాల్సిన అవ‌స‌రం ఉంది.

ఈ విష‌యాన్ని గుర్తించినా.. బీజేపీ నాయ‌కులు మాత్రం.. బీసీల విష‌యంలో ఉదాసీనంగా ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది. క‌నీసం త‌న‌ను గురించి ప‌ట్టించుకోలేద‌ని.. పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో త‌న సీటు విష‌యాన్ని తేల్చమ‌ని కోరినా… త‌న విన్న‌పాన్ని వినిపించుకోలేద‌ని… విక్ర‌మ్ గౌడ్ వ్యాఖ్యానించ‌డాన్ని బ‌ట్టి.. బీజేపీలో బీసీల‌కు విలువ లేదా? అనే చ‌ర్చ సాగుతుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రోవైపు.. గ్రూపు రాజ‌కీయాలు కూడా.. బీజేపీని ఇబ్బంది పెడుతున్నాయి. కిష‌న్ రెడ్డి వ‌ర్సెస్ బండి సంజ‌య్‌ల మ‌ధ్య ఇప్ప‌టికీ స‌ఖ్య‌త‌లేదు.

నాయ‌కుల మ‌ధ్య స‌ఖ్య‌త లేదు. ఒక‌రిపై ఒక‌రు అంత‌ర్గ‌త చ‌ర్చ‌ల్లో కుమ్ములాడుకునేందుకు ప్రాధాన్యం ఇస్తున్నార‌నే వాద‌న ఉంది. ఈ ప్ర‌భావ‌మే.. బీసీల‌పై ప‌డుతోంద‌ని చెబుతున్నారు. కేవ‌లం ఒకే ఒక్క‌స్థా నం ఉన్న బీసీ వ‌ర్గాన్ని మ‌రింత బలోపేతం చేసుకునేందుకు ఇప్ప‌టి నుంచి ప్ర‌య‌త్నాలు సాగించ‌క పోతే.. ద‌క్షిణాదిలో ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ ఆశ‌లు క‌ల‌లుగానే మిగిలిపోతాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఏం చేస్తారో.. చూడాలి.