ఆ బ్లాక్‌బస్ట‌ర్ సీక్వెల్‌కు సై అంటున్న వెంక‌టేష్‌..?!

టాలీవుడ్ లో సీనియర్ హీరో వెంకటేష్ మూడున్నర దశాబ్దాలుగా జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వస్తున్నారు. ప్రస్తుతం వెంకటేష్ నటించిన సైంధవ్‌ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. మహేష్ బాబు, రవితేజ, నాగార్జున లాంటి స్టార్ హీరోల సినిమాలతో పోటీ పడుతూ వెంకటేష్ సైంధవ్‌ సినిమాతో ప్రేక్షకులు ముందుకు వస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా వెంకటేష్ ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు. ఓ విలేకరి వెంకటేష్ కెరీర్‌లో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాగా నిలిచిన ” నువ్వు నాకు నచ్చావ్ ” సినిమాకు సీక్వెల్ చేస్తారా అంటూ ప్రశ్నించారు.

2001లో కే. విజయభాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఆ రోజుల్లో సూపర్ డూపర్ హిట్ అవడంతో పాటు 57 కేంద్రాల్లో వంద రోజులు పూర్తి చేసుకుంది. ఈ సినిమాతోనే దివంగత న‌టి ఆర్తి అగర్వాల్ హీరోయిన్గా పరిచయం అయింది. ఈ సినిమాకు సీక్వెల్ వస్తే బాగుంటుంది అని తెలుగు సినీ ప్రేక్షకులు ఎన్నో ఎళ్లుగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఇదే ప్రశ్న ఎదురవడంతో వెంకటేష్ మాట్లాడుతూ మీరు వెంటనే త్రివిక్రమ్ కు ఫోన్ చేసి కథ రాయమని చెప్పండి.. నేను నటిస్తా అంటూ సరదాగా నవ్వులు పోయించారు.

ఏది ఏమైనా నువ్వు నాకు నచ్చావ్ లాంటి క్లాసికల్ హిట్ సినిమాకు సీక్వెల్ వస్తే కచ్చితంగా ఆ సినిమాపై అంచనాలు మామూలుగా ఉండవు. అయితే కథ విషయంలో జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం ఉంటుంది. నాగార్జున కెరీర్‌లో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాగా నిలిచిన మన్మధుడు సినిమాకు సీక్వెల్ గా మన్మధుడు 2 సినిమా తీస్తే ఎంత పెద్ద డిజాస్టర్ అయిందో చూసాం. పైగా ఈ సినిమాతో నాగార్జున పరువు మొత్తం పోయింది. వెంకటేష్ నువ్వు నాకు నచ్చావ్ సినిమాకు సీక్వెల్‌ తీస్తే చాలా జాగ్రత్తలు తీసుకుంటాడని ఆశిద్దాం.