చింత‌ల‌పూడి వైసీపీ అభ్య‌ర్థిగా కె. విజ‌య‌రాజు ఫిక్స్‌… నెర‌వేరిన 15 ఏళ్ల క‌ల‌..!

ఏపీలో వచ్చే ఎన్నికలకు రెడీ అవుతున్న వైసీపీ అధినేత ముఖ్యమంత్రి జగన్ పలు నియోజకవర్గాలలో సిట్టింగ్‌ల‌ను మార్చేయటం.. లేదా స్థాన చలనం చేయటం చేస్తున్నారు. ఈ ప్రక్రియ చక చక జరుగుతుంది. ఈ క్రమంలోనే ఏలూరు జిల్లాలోని చింతలపూడి ఎస్సీ రిజర్వ్‌డ్‌ నియోజకవర్గంలోనూ సిట్టింగ్ ఎమ్మెల్యే వీఆర్ ఎలీజాకు జగన్ షాక్ ఇచ్చేశారు. వచ్చే ఎన్నికలలో నీకు సీటు ఇవ్వడం లేదని తేల్చి చెప్పేశారు. సోమవారం ముఖ్యమంత్రి జగన్‌ను కలిసిన ఎలీజాకు జగన్‌తో పాటు ఉభయగోదావరి జిల్లాల పార్టీ ఇన్‌చార్జ్ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కూడా ఈ విషయంలో క్లారిటీ ఇవ్వడంతో ఎలీజా తీవ్ర నిరుత్సాహంతో వెనుతిరిగారు.

ఇక మంగ‌ళ‌వారం చింత‌ల‌పూడిలో త‌న అనుచ‌రుల‌తో స‌మావేశం నిర్వ‌హించిన ఎలీజా పార్టీ అధిష్టానం చెప్పిన విష‌యాన్ని కూడా ఓపెన్‌గానే చెప్పేశార‌ట‌. ఇక స్థానచలనం చేస్తున్న నియోజకవర్గాల విషయంలో చాలావరకు క్లారిటీ వస్తోంది. చింతలపూడి నుంచి వచ్చే ఎన్నికలలో వైసీపీ తరఫున పోటీ చేసే అభ్యర్థి విషయంలో కూడా అధిష్టానం పక్కా క్లారిటీతో ఉంది. నియోజకవర్గానికి చెందిన స్థానికుడు.. రవాణా శాఖలో ఉన్నతాధికారిగా ఉన్న కంభ‌పు విజయరాజు పేరు అధిష్టానం ఖరారు చేసింది. దీనిపై రెండు, మూడు రోజుల్లోనే అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది. విజయరాజు నియోజకవర్గంలోని కామవరపుకోట మండల కేంద్రానికి చెందిన వ్యక్తి. పైగా శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు ఆయనకు స్వయాన వియ్యంకుడు.

పైగా సిట్టింగ్ ఎమ్మెల్యే ఎలీజాను వ్య‌తిరేకిస్తున్న‌ ఇదే నియోజకవర్గానికి చెందిన ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ వర్గం అంద‌రితోనూ గత 20 ఏళ్ల నుంచి సన్నిహిత సంబంధాలు సఖ్య‌త ఉన్నాయి. రవాణా శాఖలో అధికారిగా పనిచేస్తున్న విజయ రాజుకు చింతలపూడి నియోజకవర్గంలో పార్టీలకు అతీతంగా.. రాజకీయ నాయకులు, సామాన్య ప్రజానికంతో గత కొన్నేళ్ళుగా సంబంధాలు ఉన్నాయి. సొంత మండలం కామవరపుకోటతో పాటు లింగపాలెం, జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ, జంగారెడ్డిగూడెం మండలంలోని ప్రజలు.. నేతలతో ఎప్పటినుంచో ఆయన సన్నిహిత సంబంధాలు కంటిన్యూ చేస్తూ వస్తున్నారు.

ఆయన సర్వీసులో వివాదాలు లేకపోవడం, ఎంపీ వర్గం సపోర్ట్‌ ఇవన్నీ ఆయనకు ప్ల‌స్ కానున్నాయి. వాస్తవంగా చూస్తే చింతలపూడి 2009లో ఎస్సీలకు రిజర్వ్ చేసినప్పటి నుంచి ఆయన అసెంబ్లీకి వెళ్లాలని కలలు కంటూ వచ్చారు. 2009లోనే కాంగ్రెస్ సీటు కోసం విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేశారు. 2014లో వైసీపీ నుంచి ఆయనకు టికెట్ రావాల్సి ఉన్నా చివరి క్షణంలో సమీకరణలు మారడంతో దక్కలేదు. ఎట్టకేలకు 15 సంవత్సరాల తర్వాత విజయరాజుకు ఎమ్మెల్యే సీటు దక్కుతోంది. ఎప్ప‌ట‌కైనా ఎమ్మెల్యే సీటు వ‌స్తుంద‌న్న ధీమాతోనే ఆయ‌న ఈ 15 సంవత్సరాలలో చింతలపూడి నియోజకవర్గంలో చాప కింద నీరులా తన పని తాను చేసుకుంటూ ప‌క్కా ప్లానింగ్‌తో వెళుతూ ఎట్ట‌కేల‌కు స‌క్సెస్ అయ్యారు.