కమ్యూనిస్టులతో సైకిల్..ఆ స్థానాల్లో మద్ధతు.!

మళ్ళీ చాలాకాలం తర్వాత తెలుగుదేశం, కమ్యూనిస్టులు కలిసి పనిచేయనున్నారు. ఎప్పుడో 2009 ఎన్నికల్లో టి‌డి‌పి-కమ్యూనిస్టులు పొత్తులో పోటీ చేసిన విషయం తెలిసిందే. మళ్ళీ వారు కలిసి పనిచేయలేదు. 2019 ఎన్నికల్లో టి‌డి‌పి ఓడిపోయి ప్రతిపక్షంలోకి వచ్చాక..కమ్యూనిస్టులతో కలిసే కొన్ని సందర్భాల్లో ప్రజా పోరాటాలు చేశారు. సి‌పి‌ఐ…టి‌డి‌పికి మద్ధతుగా నిలుస్తూ వచ్చింది. ఇదే సమయంలో ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కలిసి పనిచేయాలని టి‌డి‌పి-కమ్యూనిస్టులు సిద్ధమవుతున్నాయి.

మూడు పట్టభద్రులు, రెండు ఉపాధ్యాయ స్థానాలకు ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. అయితే టి‌డి‌పి కేవలం పట్టభద్రుల స్థానాల్లోనే పోటీ చేస్తుంది. అటు కమ్యూనిస్టుల అనుబంధంగా ఉండే పి‌డి‌ఎఫ్ అన్నీ స్థానాల్లో బరిలో దిగుతుంది. అటు వైసీపీ సైతం అన్నీ స్థానాల్లో పోటీ చేస్తుంది. అయితే ఈ ఎన్నికల్లో టి‌డి‌పి-కమ్యూనిస్టులు ఓ అవగాహనకు రానున్నాయి. పట్టభద్రుల ఎన్నికల్లో పరస్పరం సహకరించుకోవాలని చూస్తున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రాధాన్య ఓట్లు ఉంటాయి. ఓటరు తమకు నచ్చిన వారికి మొదటి ప్రాధాన్య ఓటు వేసి మిగిలిన వారికి రెండో ప్రాధాన్య ఓటు.. మూడో ప్రాధాన్య ఓటు వేయవచ్చు.

ఓట్ల లెక్కింపులో మొదటి ప్రాధాన్య ఓట్ల ద్వారా ఏ అభ్యర్థీ గెలవకపోతే రెండో ప్రాధాన్య ఓట్లు, ఆ తర్వాత మూడో ప్రాధాన్య ఓట్లు కూడా లెక్కిస్తారు. అన్నీ కలిపి ఎవరికి ఎక్కువ వస్తే వారు గెలిచినట్లు ప్రకటిస్తారు. మొదటి ప్రాధాన్య ఓట్లు చాలినన్ని ఎవరికీ రాకపోతేనే మిగిలిన రౌండ్ల లెక్కింపు జరుగుతుంది. ఇక వైసీపీ అటు పట్టభద్రులు, ఇటు ఉపాధ్యాయ స్థానాల్లో గెలవకుండా ఉండటానికి..టి‌డి‌పి-కమ్యూనిస్టులు సహకరించుకోనున్నారు.

మొదట పట్టభద్ర స్థానాల్లో వామపక్షాలు మొదటి ప్రాధాన్య ఓటును తమ వారికి వేసుకుని రెండో ప్రాధాన్య ఓటును టీడీపీకి వేస్తాయి. అలాగే టీడీపీ కూడా మొదటి ప్రాధాన్య ఓటును తమ వారికి వేసుకుని రెండో ప్రాధాన్య ఓటును వామపక్షాల అభ్యర్థులకు వేస్తుంది. ఇక ఉపాధ్యాయ స్థానాల్లో పీడీఎఫ్‌ అభ్యర్థులను టీడీపీ బలపరచాలని కమ్యూనిస్టులు కోరుతున్నాయి. అదే సమయంలో ఏపీటీఎఫ్‌ సైతం ఉపాధ్యాయ స్థానాల్లో మద్ధతు ఇవ్వాలని టి‌డి‌పిని కోరుతుంది. మరి చూడాలి టి‌డి‌పి ఎవరికి మద్ధతు ఇస్తుందో.