పీలేరు నల్లారికే..ఆధిక్యం వచ్చిందా?

యువగళం పేరుతో లోకేష్ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర మొదలుపెట్టిన విషయం తెలిసిందే. 400 రోజుల పాటు 4 వేల కిలోమీటర్లు జరగనున్న ఈ పాదయాత్ర ప్రస్తుతం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జరుగుతుంది. ఇప్పటికే జిల్లాలోని దాదాపు అన్నీ నియోజకవర్గాలని కవర్ చేస్తూ లోకేష్ పాదయాత్ర జరుగుతుంది. తాజాగా ఆయన పాదయాత్ర పీలేరులో నడుస్తోంది. అయితే లోకేష్ ఏ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తే..అక్కడ టి‌డి‌పి నుంచి పోటీ చేసే అభ్యర్ధులని డిక్లేర్ చేసేస్తున్నారు.

ఇప్పటికే కాళహస్తిలో బొజ్జల సుధీర్ రెడ్డి, నగరిలో గాలి భాను ప్రకాష్, పలమనేరులో అమర్నాథ్ రెడ్డి, చంద్రగిరిలో పులివర్తి నాని, పుంగనూరులో చల్లా బాబు..ఇలా వరుసగా అభ్యర్ధులని ఫిక్స్ చేస్తున్నారు. ఇదే క్రమంలో పీలేరులో టి‌డి‌పి నుంచి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పోటీ చేయడం ఖాయమైంది. ఈ మేరకు లోకేష్ సైతం..పీలేరులో కిషోర్ బరిలో ఉంటారని ప్రకటన చేశారు. అయితే చంద్రబాబు ఆదేశాలతోనే లోకేష్ అభ్యర్ధులని ఖరారు చేస్తున్నారని తెలుస్తోంది. అయితే వరుసగా ఐదు ఎన్నికల్లో పీలేరులో టి‌డి‌పి ఓడిపోతూ వస్తుంది.

ఎప్పుడో 1994లో మాత్రమే ఇక్కడ టి‌డి‌పి గెలిచింది..ఆ తర్వాత 1999, 2004, 2009, 2014, 2019 ఎన్నికల్లో వరుసగా టి‌డి‌పి ఓడిపోతూనే వస్తుంది. గత రెండు ఎన్నికల్లో వైసీపీ నుంచి చింతల రామచంద్రారెడ్డి గెలుస్తూ వస్తున్నారు. ఇక కిశోర్ 2014లో కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోగా, 2019 ఎన్నికల్లో టి‌డి‌పి నుంచి పోటీ చేసి ఓడిపోయారు.

అయితే ఈ సారి ఎన్నికల్లో గెలవాలనే పట్టుదలతో కిషోర్ పనిచేస్తున్నారు. అటు వైసీపీ ఎమ్మెల్యే చింతలకు ఈ సారి పాజిటివ్ కనిపించడం లేదు. ఈ సారి ఇక్కడ కిషోర్‌కే గెలుపు అవకాశాలు మెండుగా ఉన్నాయి. చూడాలి మరి పీలేరు ఎవరికి దక్కుతుందో.