బీజేపీలోకి నల్లారి..ఒక్క ఓటే వస్తుందా?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దశాబ్దాల పాటు కాంగ్రెస్ లో పనిచేసిన ఆయన…తాజాగా రాజీనామా చేశారు. ఇక కిరణ్..బి‌జే‌పిలో చేరడానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే బి‌జే‌పి అధిష్టానంతో అన్నీ చర్చలు జరిగాయని..రేపో మాపో అధికారికంగా బి‌జే‌పిలో చేరడం ఖాయమని తెలుస్తోంది.

అయితే కిరణ్ కుమార్ రెడ్డి బి‌జే‌పిలోకి వెళ్ళడం వల్ల ఆ పార్టీకి ఎలాంటి ఉపయోగం లేదని వైసీపీ నేత డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు. ఆయన బీజేపీలో చేరడం ద్వారా ఒక ఓటు మాత్రమే వస్తుందని, అది కిరణ్‌కుమార్‌రెడ్డిదే అని, ఆయన కుటుంబ సభ్యులు కూడా బీజేపీకి ఓటు వేయరని, ఇలాంటి వ్యక్తులను బీజేపీ ఎందుకు చేర్చుకుంటుందో తెలీదని చెప్పుకొచ్చారు. ఇక వైసీపీలో ఉండే డొక్కా..కిరణ్ గురించి ఎందుకు కామెంట్ చేశారో క్లారిటీ లేని విషయం. కాకపోతే గతంలో వీరు కాంగ్రెస్ లోనే పనిచేశారు. డొక్కా ఏమో కాంగ్రెస్ తర్వాత టి‌డి‌పిలోకి వెళ్లారు..మళ్ళీ 2019 ఎన్నికల తర్వాత వైసీపీలోకి వెళ్లారు.

ఇటు కిరణ్ కాంగ్రెస్ పార్టీలో పలుమార్లు ఎమ్మెల్యేగా, స్పీకర్ గా పనిచేశారు. ఉమ్మడి ఏపీ సి‌ఎం గా పనిచేశారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో సి‌ఎం పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. అలాగే జై సమైక్యాంధ్ర పార్టీ పెట్టి 2014 ఎన్నికల్లో పోటీ చేసి దెబ్బతిన్నారు. తర్వాత రాజకీయాలకు దూరమయ్యారు. మళ్ళీ కాంగ్రెస్ లో చేరారు. అయినా సరే పార్టీలో యాక్టివ్ గా లేరు.

ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి..బి‌జే‌పిలో చేరడానికి రెడీ అయ్యారు. అయితే కిరణ్ ఫాలోయింగ్ చాలా వరకు తగ్గింది. ఇటు ఏపీలో బి‌జే‌పికి ఏ మాత్రం బలం లేదు. అలాంటప్పుడు కిరణ్ ఎందుకు బి‌జే‌పిలోకి వెళుతున్నారో అర్ధం కాకుండా ఉంది.