కోటంరెడ్డి తమ్ముడికి వైసీపీ గాలం..రివర్స్ షాక్?

ఎప్పుడైతే వైసీపీ నుంచి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి దూరమయ్యారో అప్పటినుంచి..కోటంరెడ్డి టార్గెట్ గా వైసీపీ రాజకీయం మొదలైంది..ఆయన్ని అడుగడుగున ఇరుకున పెట్టడమే లక్ష్యంగా ముందుకెళుతుంది. ఇదే క్రమంలో ఇటీవల కోటంరెడ్డి అనుచరులని అరెస్ట్ చేసినట్లు తెలిసింది. గత ఐదు నెలల కిందట టీడీపీ నేతపై దాడి చేశారనే అభియోగం ఉన్న నేపథ్యంలో తాజాగా పోలీసులు కోటంరెడ్డి అనుచరులని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.

అయితే తన అనుచరుడు కోసం కోటంరెడ్డి పోరాటం మొదలుపెట్టారు.  మాజీ కార్పొరేటర్‌ తాటి వెంకటేశ్వరరావుతోపాటు కార్యకర్తలు జావీద్‌, మన్నేపల్లి రఘును అరెస్టు చేశారని, షాడో సీఎం సజ్జల రామకృష్ణారెడ్డి ఆదేశాల మేరకే పోలీసులు నాటి కేసును నేడు కీలకమైన కేసుగా మార్చారని, కనీస ముందస్తు సమాచారం లేకుండా అరెస్టు చేసి.. వారిని పోలీ్‌సస్టేషన్‌కు తీసుకెళ్లకుండా మానసికంగా ఇబ్బంది పెడుతున్నారని ఫైర్ అయ్యారు. 24 గంటల్లో కోర్టుకు హాజరు పరుస్తామని చెప్పిన పోలీసు అధికారులు రాత్రికిరాత్రే చార్జిషీట్‌లను సిద్ధం చేసి తెల్లవారుజామున 4 గంటలకు మెజిస్ట్రేట్‌ ముందు హాజరు పరిచి రిమాండ్‌కు పంపించారని అన్నారు.

అలాగే తన పేరు కూడా ఈ కేసులో చేర్చారని, తనతోపాటు 11 మందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారని, కానీ ప్రభుత్వ పెద్దలు తన సోదరుడు గిరిధర్‌రెడ్డి పేరు పెట్టడం మరిచిపోయారా లేక ప్రత్యేకమైన ప్రేమను చూపిస్తున్నారా? అని ప్రశ్నిస్తూనే..తనపై కేసు పెట్టి తన తమ్ముడుని వైసీపీ వైపుకు లాగడం ఎవరి తరం కాదని సజ్జలకు వార్నింగ్ ఇచ్చారు.  అలాంటి జిమ్మిక్కులు ఎన్ని చేసినా తాను లొంగనని, సమస్యలను ఎదుర్కొని పోరాటం చేస్తామని, తాను రూరల్‌ నియోజకవర్గంలోనే తిరుగుతుంటానని చెప్పుకొచ్చారు. మొత్తానికి కోటంరెడ్డి సోదరుడుపై వైసీపీ గాలం వేసింది.

Share post:

Latest