తారకరత్న కోరిక అదే..నెరవేరకుండానే.!

23 రోజుల పాటు మృత్యువుతో పొరాడి…చివరికి శనివారం రాత్రి నందమూరి తారకరత్న తుదిశ్వాస విడిచారు. గత నెలలో నారా లోకేష్ పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న గుండెపోటుకు గురైన విషయం తెలిసిందే. ఆ వెంటనే కార్యకర్తలు..కుప్పంలోని హాస్పిటల్‌కు తరలించారు. ఇంకా మెరుగైన వైద్యం కోసం బెంగళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ విదేశీ వైద్యులని సైతం రప్పించి తారకరత్నకు చికిత్స అందిస్తూ వచ్చారు. కానీ, అందరినీ విషాదంలో ముంచుతూ తారకరత్న తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. 23రోజుల పాటు మృత్యువుతో పోరాడిన తారకరత్న చివరకు కన్నుమూసినట్లు ఆస్పత్రి వర్గాలు శనివారం రాత్రి ప్రకటించాయి.

అయితే ఓ వైపు సినిమాలు చేస్తూనే..మరోవైపు రాజకీయాల వైపుకు వచ్చిన తారకరత్న ఇటీవల కాలంలో టీడీపీలో యాక్టివ్ గా తిరుగుతున్నారు. ఆ మధ్య చాలా ప్రాంతాల్లో తన అభిమానులు, టీడీపీ కార్యకర్తలతో కలిసి తిరిగారు. అదే సమయంలో తాను ఎమ్మెల్యేగా పోటీ చేయాలని అనుకుంటున్నానని తన మనసులో కోరికని బయటపెట్టారు. అయితే ఏ సీటులో పోటీ చేస్తారనే అంశంపై కూడా పెద్ద ఎత్తున చర్చ నడిచింది.

ఇదే క్రమంలో ఆ మధ్య లోకేష్‌తో తారకరత్న భేటీ అయిన విషయం తెలిసిందే. అయితే.. అప్పట్లో ఈ ఇద్దరి భేటీ ఏపీ రాజకీయాల్లో పెద్ద చర్చే జరిగింది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో కీలక నియోజకవర్గమైన గుడివాడ నుంచి తారకరత్న పోటీచేయాలని గట్టి ప్రయత్నాలే చేశారని టాక్ నడిచింది. ఈ విషయాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు, యువనేత నారా లోకేష్‌కు కూడా చెప్పినట్లు సమాచారం. వారిద్దరి నుంచి కూడా దాదాపు గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. కానీ ఎమ్మెల్యేగా పోటీ చేయకుండానే తారకరత్న కానరాని లోకాలకు వెళ్ళిపోయారు.