పెద్దాపురంలో టీడీపీలో అసంతృప్తి సెగలు..రాజప్పకు యాంటీ!

తెలుగుదేశం పార్టీకి కంచుకోటల్లాంటి నియోజకవర్గాల్లో పెద్దాపురం కూడా ఒకటి. ఇక్కడ టి‌డి‌పి ఆరుసార్లు గెలిచింది. గత రెండు ఎన్నికల్లో ఇక్కడ టి‌డి‌పి నుంచి చినరాజప్ప గెలుస్తూ వస్తున్న విషయం తెలిసిందే. ఇక మూడోసారి కూడా ఆయన పోటీకి రెడీ అవుతున్నారు. అయితే పెద్దాపురంలో పార్టీ పరంగా టి‌డి‌పి బలంగానే ఉంది..కానీ రాజప్పకు సొంత పార్టీలోనే వ్యతిరేకత కనిపిస్తుంది. ఈ సారి ఆయనకు సీటు ఇవ్వవద్దని వేరే వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి.

మొదట నుంచి పెద్దాపురం సీటు కమ్మ వర్గానిదే. బొడ్డు భాస్కర రామారావు గతంలో పోటీ చేసి గెలిచారు. ఆయన చనిపోవడంతో..ఆయన తనయుడు ఇప్పుడు సీటు ఆశిస్తున్నారు. అలాగే మరో కమ్మ నేత కూడా సీటుపై కన్నేశారు. అయితే తాజాగా పెద్దాపురం పర్యటనకు వచ్చిన చంద్రబాబు సమక్షంలోనే రాజప్ప వ్యతిరేక వర్గం హల్చల్ చేసింది. రాజప్పకు వ్యతిరేకంగా నినాదాలు చేసింది. రాజప్పకు సీటు ఇవ్వవద్దని డిమాండ్ చేసింది. అయితే చంద్రబాబు వారికి నచ్చజెప్పి..మూడోసారి రాజప్పని గెలిపించాలని, మళ్ళీ ఆయనే పోటీ చేస్తారని చెప్పారు.

అలాగే సీటు ఆశిస్తున్న నేతలకు న్యాయం చేసే బాధ్యత తనది అని చెప్పుకొచ్చారు. బొడ్డు ఫ్యామిలీకి న్యాయం చేస్తానని చెప్పుకొచ్చారు. అయినా సరే బొడ్డు వర్గం అసంతృప్తిగానే ఉన్నట్లు తెలుస్తోంది. రాజప్పకు సీటు ప్రకటించడంతో..ఆయనకు వ్యతిరేకంగా పనిచేసే అవకాశాలు ఉన్నాయి. దీంతో చంద్రబాబు మరోసారి బొడ్డు వర్గంతో మాట్లాడాలని అనుకుంటున్నారు. ఇక ఆయన్ని బుజ్జగించే బాధ్యత ప్రత్తిపాటి పుల్లారావుకు అప్పగించారు. పార్టీలో న్యాయం చేస్తామని, రాజప్పకు సహకరించాలని కోరుతున్నారు. మరి బొడ్డు వర్గం రాజప్పకు ఏ మేర సహకరిస్తుందో చూడాలి.

Share post:

Latest