తార‌క‌ర‌త్న తొలి సినిమా వెన‌క ఇంత పెద్ద క‌థ ఉందా..?

నందమూరి తారకరత్న ఇక లేరు అన్న సంగ‌తి తెలిసిందే. నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర ప్రారంభం రోజున ఆ కార్యక్రమంలో పాల్గొన్న తారకరత్న కార్డియాక్ అరెస్ట్‌తో కుప్పకూలిపోయారు. అప్పటి నుంచి ఆయనకు బెంగళూరులో వైద్యం అందుతోంది. అయితే గ‌త 23 రోజుల నుంచి మృత్యువుతో పోరాడి ఓడిపోయారు. శ‌నివారం రాత్రి తిర‌గిరాని లోకాల‌కు వెళ్లిపోయారు. తార‌క‌ర‌త్న మ‌ర‌ణ వార్త టాలీవుడ్ తో టీడీపీలోనూ తీవ్ర విషాదాన్ని నింపింది. ఆరోగ్యంగా తిరిగి వస్తారని భావించిన నందమూరి అభిమానులు ఆయన మృతిని జీర్ణించుకోలేకపోతున్నారు.

ఇక, కుటుంబ సభ్యుల వేదన వర్ణనాతీతం. ఇక ఈ సంద‌ర్భంగా తార‌క‌ర‌త్నకు సంబంధించి ఎన్నో విష‌యాలు తెర‌పైకి వ‌స్తున్నాయి. తార‌క‌ర‌త్న తొలి చిత్రం `ఒకటో నంబర్ కుర్రాడు` అన్న సంగ‌తి తెలిసిందే. 2002లో విడుద‌లైన ఈ చిత్రం మంచి విజ‌యం సాధించింది. అయితే ఈ సినిమా తెర‌కెక్క‌డం వెన‌క పెద్ద క‌థ ఉంది. దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు తన 100వ చిత్రానికి సన్నాహకాలు చేసుకుంటన్న రోజులు అవి. ఇండ‌స్ట్రీలో ఓ స్టార్ హీరోతో త‌న వందో సినిమాను చేయాల‌ని ద‌ర్శ‌కేంద్రుడు భావించాడు.

అదే స‌మ‌యంలో తారకరత్న తండ్రి నందమూరి మోహనకృష్ణ దర్శకేంద్రుడిని సంప్రదించి.. మీ వందవ చిత్రంగా నా కొడుకుని లాంచ్ చేయండి అని రిక్వస్ట్ చేశారు. మ‌రోవైపు అల్లు అరవింద్ కూడా అల్లు అర్జున్ ని లాంచ్ చేయమని అడిగార‌ట‌. అయితే ఎన్నో చ‌ర్చ‌ల అనంత‌రం రాఘవేంద్ర రావు బ‌న్నీకి ఓటేశారు. అలాగే తార‌క‌ర‌త్న‌ను ప‌క్క‌న పెట్టలేదు. తారకరత్న డ‌బ్యూకు తాను అండ‌గా ఉంటాన‌ని మోహ‌న్ కృష్ణ‌కు హామీ ఇచ్చారు. కథని ప్రిపేర్ చేయిస్తా, సమర్పకుడిగా కూడా ఉంటా. దర్శకుడిని మాత్రం మీరు తెచ్చుకోండి అని చెప్పార‌ట‌. దాంతో మోహ‌న్ కృష్ణ బి గోపాల్, సింగీతం శ్రీనివాసరావు వంటి వారిని సంప్ర‌దించ‌గా ప‌లు కార‌ణాల వ‌ల్ల వారు నో చెప్పారు. చివ‌ర‌కు ద‌ర్శ‌కేంద్రుడే కోదండరామిరెడ్డిని సూచించారు. అలా ఒకటో నెంబర్ కుర్రాడు చిత్రం కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కింది. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎంత సంచ‌ల‌న విజ‌యం సాధించిందో తెలిసిందే.

Share post:

Latest