చింతలపూడి టీడీపీలో నాలుగు స్తంభాలాట!

కంచుకోటల్లాంటి నియోజకవర్గాలని చేతులారా టి‌డి‌పి నేతలు నాశనం చేస్తున్నారని చెప్పవచ్చు. అంతర్గత పోరుతో గెలుపు అవకాశాలు ఉన్న సీట్లని ఓటమి దిశగా తీసుకెళుతున్నారు. అలా ఓటమి దిశగా వెళుతున్న సీట్లలో చింతలపూడి కూడా ఒకటి. ఈ నియోజకవర్గం టి‌డి‌పికి కంచుకోట. అందులో ఎలాంటి డౌటే లేదు. 2014 ఎన్నికల్లో కూడా ఇక్కడ టి‌డి‌పి జెండా ఎగిరింది. కానీ ఆ తర్వాత నుంచి గ్రూపులు రావడం..సీటు కోసం పోటీ పడే నేతలు పెరగడంతో రచ్చ మొదలైంది.

గత ఎన్నికల్లో టి‌డి‌పి నుంచి కర్రా రాజారావు పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత ఆయన అనారోగ్యంతో మరణించారు. అప్పటినుంచి చింతలపూడిలో ఇంచార్జ్ లేరు. ఈ సీటు కోసం నేతలు గట్టిగా పోటీ పడటం, ఎవరికి వారు సెపరేట్ గా కార్యక్రమాలు చేస్తున్నారు. దీంతో సీటు ఎవరికి ఇవ్వాలనే అంశంపై క్లారిటీ రావడం లేదు. ప్రస్తుతం ఈ సీటు కోసం నలుగురు నేతలు పోటీ పడుతున్నారు. మాజీ జెడ్పీ ఛైర్మన్ కొక్కిరిగడ్డ జయరాజు, జంగారెడ్డిగూడెం టౌన్‌కు చెందిన పారిశ్రామికవేత్త ఆకుమర్తి రామారావు, మిషన్ హోప్ సంస్థ స్థాపకులు సొంఘా రోషన్, ఎన్‌ఆర్‌ఐ బొమ్మాజీ అనిల్…ఈ నలుగురు ఇప్పుడు చింతలపూడి సీటు రేసులో ఉన్నారు.

ఎవరికి వారు సీటు దక్కించుకోవాలని చూస్తున్నారు. ఈ నలుగురు తమకు అధిష్టానంతో ఉన్న పరిచయాలతో సీటు దక్కించుకోవాలని చేస్తున్నారు. ఎవరికి వారు పార్టీ కార్యక్రమాలు చేస్తూనే..సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు.  దీంతో టి‌డి‌పి అధిష్టానం కన్ఫ్యూజన్ లో ఉంది..సీటు ఎవరికి ఇవ్వాలనే అంశంపై తేల్చలేక ఉంది. పైగా ఒకరికి సీటు ఇస్తే మిగతా ముగ్గురు సహకరిస్తారా? అనేది డౌటే. మొత్తానికి ఇలా గ్రూపులతో చింతలపూడిలో టి‌డి‌పికి ఇబ్బందిగా మారింది.