సామినేని వర్సెస్ వెల్లంపల్లి..పెద్ద పంచాయితీ..వైసీపీకి డ్యామేజ్!

అధికార వైసీపీలో ఆధిపత్య పోరు ఉన్న విషయం తెలిసిందే..చాలా నియోజకవర్గాల్లో సొంత నేతల మధ్య పోరు నడుస్తోంది. సొంత పార్టీ నేతలకే చెక్ పెట్టాలని చెప్పి కొందరు నాయకులు పావులు కదుపుతున్నారు. ఇలా చాలా నియోజకవర్గాల్లో రచ్చ నడుస్తోంది. తాజాగా విజయవాడ పరిధిలో వైసీపీ ఎమ్మెల్యేల మధ తగాదా సంచలనంగా మారింది. విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు, జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభానుల మధ్య గొడవ తారస్థాయిలో జరిగింది.

ఇద్దరు ఎమ్మెల్యేలు ఒకరినొకరు బూతులు తిట్టుకునే వరకు పరిస్తితి వెళ్లింది. తాజాగా విజయవాడ వైసీపీ నగర అధ్యక్షుడు బొప్పన భవకుమార్ పుట్టిన రోజు వేడుకలు జరిగాయి. ఈ వేడుకలకు వెల్లంపల్లి, సామినేని, దేవినేని అవినాష్..ఇతర వైసీపీ నేతలు హాజరయ్యారు. ఇదే క్రమంలో జగ్గయ్యపేటకు చెందిన ఆకుల శ్రీనివాస్‌ని జగన్‌ దగ్గరకు ఎందుకు తీసుకెళ్లావని వెల్లంపల్లి..ఉదయభానుని ప్రశ్నించారు. కాంగ్రెస్ లో ఉన్నప్పటి నుంచి శ్రీనివాస్‌ తనకు సన్నిహితుడు అని, తీసుకెళితే తప్పేంటి అని సామినేని ప్రశ్నించారు.

దీంతో వెల్లంపల్లి  తన నియోజకవర్గ రాజకీయాల్లో తలదూర్చాల్సిన అవసరమేంటని  ఫైర్ అయ్యారు. దీంతో విజయవాడ నీకేమైనా రాసిచ్చారా? అని ఉదయభాను ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘నువ్వు నా నియోజకవర్గానికి వచ్చి రాజకీయాలు చేస్తే నేను నీ జగ్గయ్యపేటకు వచ్చి రాజకీయాలు చేస్తా’’ అని వెలంపల్లి రెచ్చిపోయారు. ‘‘నీకు దమ్ముంటే జగ్గయ్యపేటలో అడుగుపెట్టు’’ అంటూ ఉదయభాను సైతం రెచ్చిపోయారు. ఒకానొక సమయంలో తోసుకునే వరకు వెళ్ళడంతో దేవినేని సర్ది చెప్పారు. ఆ తర్వాత వెల్లంపల్లి ఆ వేడుకల నుంచి వెళ్ళిపోయారు.

తిట్టుకునే సమయంలో ఉదయభాను సామాజికవర్గాన్ని ఉద్దేశించి వెలంపల్లి కాపు రౌడీలు అని అన్నారని, అందుకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని కాపునాడు డిమాండ్ చేసింది. మొత్తానికి విజయవాడ వైసీపీలో ఇలా రచ్చ నడిచింది. ఈ రచ్చ కాస్త వైసీపీకి డ్యామేజ్ అయ్యేలా ఉంది.