ఇదేం ఖర్మ వర్సెస్ గడపగడపకు..జనం నమ్మేది ఎవరిని?

అటు అధికార వైసీపీ…ఇటు ప్రతిపక్ష టీడీపీ..కొత్త కొత్త కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళుతున్నాయి. తాము చేసిన పనులని ఇంటింటికి వెళ్ళి చెప్పుకోవడమే లక్ష్యంగా వైసీపీ గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. అటు వైసీపీ వైఫల్యలు, ప్రజలపై మోపిన భారం, కక్ష సాధిస్తున్న విధానాలని ప్రజలకు వివరించడానికి టీడీపీ ఇప్పటికే బాదుడేబాదుడు కార్యక్రమం చేస్తుంది..ఇప్పుడు ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి అని ప్రోగ్రాం మొదలుపెట్టింది.

అయితే రెండు పార్టీల లక్ష్యం ప్రజల ఓట్లు కొల్లగొట్టడమే. ఇక వీరిలో ప్రజలు ఎవరిని ఎక్కువ నమ్మితే వారిని గెలిపిస్తారు. కాకపోతే ఇప్పుడున్న పరిస్తితుల్లో ఎవరిని ప్రజలు ఎక్కువ నమ్ముతున్నట్లు కనిపిస్తున్నారనేది చూస్తే..తాము అమలు చేసే పథకాల గురించి ప్రతి ఎమ్మెల్యే ఇంటింటికి వెళ్ళి వివరిస్తున్నారు. అలాగే ప్రతి ఇంటికి ఇంత లబ్ది జరిగిందని, ఇన్ని డబ్బులు ఇచ్చామని చెబుతున్నారు. ఇలా గడపగడప కార్యక్రమం బాగానే నడుస్తోంది.

కాకపోతే కొన్నిచోట్ల ఎమ్మెల్యేలకు నిరసనలు ఎదురవుతున్నాయి. ఎందుకంటే పథకాలు ఒకటే చాలదు..రోడ్లు, డ్రైనేజ్‌లు, తాగునీటి సమస్యలని పరిష్కరించడం, రాష్ట్రానికి కొత్త కంపెనీలు తీసుకురావడం ఇలా రకరకాలుగా ప్రజలు, నేతలని ప్రశ్నిస్తున్నారు. ఇక కొందరు పథకాల పట్ల సానుకూలత చూపిస్తున్నారు. అదే సమయంలో పెరిగిన ధరలు, కరెంట్ బిల్లులు, ఇసుక, ఇంటి పన్ను, చెత్త పన్ను ఇలా పెరిగిన పన్నుల భారంపై ప్రశ్నిస్తున్నారు. అంటే వైసీపీ కార్యక్రమానికి పాజిటివ్ ఉంది..అదే సమయంలో నెగిటివ్ ఉంది.

ఇక బాదుడేబాదుడు, ఇదేం ఖర్మ కార్యక్రమాలని టీడీపీ నిర్వహిస్తుంది. ఇంటింటికి వెళ్ళి ప్రజలపై జగన్ ప్రభుత్వం మోపిన పన్నుల భారాన్ని వివరిస్తున్నారు. వైసీపీ నేతల అక్రమాలపై పోరాడుతున్నారు. ఇటు టీడీపీకు కూడా బాగానే స్పందన వస్తుంది. కాకపోతే నేతలు పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వెళ్ళడం లేదు. అదే టీడీపీకి మైనస్. మొత్తానికి రెండు పార్టీల కార్యక్రమాలు ప్రజల్లోకి వెళుతున్నాయి. మరి చివరికి ప్రజలు ఎవరిని నమ్ముతారో చూడాలి.