బాబు జిల్లాలో ‘ఫ్యాన్స్’ పరుగులు..సీటు డౌటే!

వై నాట్ 175 నినాదంతో జగన్ ముందుకెళుతున్న విషయం తెలిసిందే. మనం ప్రజలకు మంచి చేస్తున్నాం కాబట్టి 175కి 175 సీట్లు గెలిచేస్తామని అంటున్నారు. 175  సీట్లు ఎందుకు గెలవకూడదని అని సొంత నాయకులని ప్రశ్నిస్తున్నారు. ఇలా టార్గెట్ గా పెట్టుకున్న జగన్..ఎమ్మెల్యేలని పరుగులు తీయిస్తున్నారు. గడప గడపకు వెళ్ళాల్సిందే అని ప్రతిసారి క్లాస్ పీకుతున్నారు. ఇప్పటికే పలుమార్లు వర్క్ షాప్ పెట్టి గడపగడపకు వెళ్లనివారికి క్లాస్ ఇచ్చారు. అలాగే సీటు కూడా ఇవ్వనని చెప్పేస్తున్నారు. దీంతో ఎమ్మెల్యేల్లో కంగారు పెరిగింది. తాజాగా మరోసారి వర్క్ షాప్ పెట్టడానికి జగన్ సిద్ధమయ్యారు. డిసెంబర్ 4న వర్క్ షాప్ పెట్టనున్నారు. దీంతో ఎమ్మెల్యేలు పరుగులెత్తుతున్నారు.

ఎమ్మెల్యేలు గడప గడపకు కార్యక్రమాన్ని వేగం చేశారు. ఇదే క్రమంలో చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో వైసీపీ ఎమ్మెల్యేలు ఉరుకులు పరుగులు మీద గడపగడపకు వెళుతున్నారు. జిల్లాలో 14 సీట్లు ఉంటే 13 సీట్లు వైసీపీవే. 13 మందిలో ముగ్గురు మంత్రులు ఉన్నారు. ఇక వీరంతా గడపగడపకు తిరగడాన్ని ఉదృతం చేశారు. పైగా సీట్లు అందరికీ ఫిక్స్ అవ్వలేదన్న భయం కనబడుతోంది. ఏదో నలుగురైదుగురుకు మినహా మిగిలిన వాళ్ళకు సీటు డౌటే అనే పరిస్తితి.

దీంతో గడప గడపకు వెళ్లకపోతే ఇంకా సీటు కష్టమని భావిస్తున్న ఎమ్మెల్యేలు, ఆ కార్యక్రమాన్ని ఉదృతంగా చేస్తున్నారు. సీనియర్లు అయిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి లాంటి వారికి సీటు విషయంలో డౌట్ లేదు..కానీ కొందరు ఎమ్మెల్యేలకు సీటు దక్కుతుందా లేదా? అనే అనుమానాలు ఉన్నాయి. ఆఖరికి మంత్రి రోజాకు సైతం కష్టాలు ఉన్నాయి. ఇప్పటికే నగరిలో రోజాకు సొంత పార్టీ నుంచి నిరసనలు ఎదురవుతున్నాయి. సొంత పార్టీ వాళ్లే ఆమెకు వ్యతిరేకంగా రాజకీయం నడిపిస్తున్నారు. ఆమెని పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నారు.

ఒకవేళ ఆమెకు గాని మళ్ళీ సీటు ఇస్తే, సొంత పార్టీ వాళ్లే ఓడించేలా పనిచేసే ఛాన్స్ ఉంది. మొత్తానికి చిత్తూరులో సీటు కోసం వైసీపీ ఎమ్మెల్యేలు గడప గడపకు పరుగులెడుతున్నారు.