వైసీపీలో వసంత చిచ్చు..సీటుపై ఆశలు వదులుకున్న ఎమ్మెల్యే!

ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి. హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు మార్చడం ముమ్మాటికి తప్పే అని, అలాగే కమ్మ వర్గంపై జగన్ ప్రభుత్వం కక్ష సాధించే దిశగా వెళుతుందని పరోక్షంగా వ్యాఖ్యానించారు. గత ఎన్నికల్లో 35 శాతం కమ్మ వర్గం జగన్ గెలుపు కోసం పనిచేసిందని, అయినా జగన్ క్యాబినెట్‌లో కమ్మ మంత్రి లేరని, పక్క రాష్ట్రంలోనే కమ్మ వర్గానికి మంచి ప్రాధాన్యత ఉందని చెప్పుకొచ్చారు.

అయితే ఇలా వసంత నాగేశ్వరరావు మాట్లాడటంపై..ఆయన తనయుడు మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ స్పందించారు. తండ్రి మాటలని కాస్త కవర్ చేసే ప్రయత్నం చేశారు.  వసంత నాగేశ్వరరావు (నాన్న) చేసిన వ్యాఖ్యలతో ఏకీభవించడం లేదని, విజయవాడ పార్లమెంట్‌ని జిల్లా చేసి, ఆ జిల్లాకి ఎన్టీఆర్ జిల్లా పేరు పెట్టిన సమయంలో జగన్‌ని ఎంతమంది పొగిడారు? అని, యూనివర్సిటీ పేరు మారిస్తే విమర్శించే హక్కు ఎవరిచ్చారు? అని కృష్ణ ప్రసాద్ నిలదీశారు.

కమ్మవారికి ఎటువంటి సంకేతాలు పంపుతున్నారు మీరు? | Ex. home minister vasantha  nageswara rao comments - Telugu Oneindia

ఇదీ తన వ్యక్తిగత అభిప్రాయం అని, రాజధాని విషయంలో సీఎం జగన్ నిర్ణయమే తనకు శిరోధార్యం అని, ఏ సామాజిక వర్గానికి ప్రాదాన్యత కల్పించాలనేది ముఖ్యమంత్రి నిర్ణయం అని చెప్పుకొచ్చారు. అలాగే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయమంటే చేస్తానని,లేదంటే పార్టీ కోసం పనిచేస్తానని, తనని అసెంబ్లీలో కూర్చోబెట్టిన జగన్ ఏ నిర్ణయం తీసుకున్న పాటిస్తానని అన్నారు. ఇక జోగి రమేష్‌తో విభేదాల విషయంలో అధిష్టానంతో చర్చిస్తానని అన్నారు.

ఇటు కొడాలి నాని సైతం వసంత నాగేశ్వరరావు మాటలని ఖండించారు..టీడీపీ హయాంలో మైనారిటీ, ఎస్టీలకు మంత్రి పదవి ఇవ్వలేదని, ఎన్టీఆర్‌ని కమ్మ వర్గానికే పరిమితం చేయడం సరికాదని అన్నారు. మొత్తానికి వసంత నాగేశ్వరావు చేసిన వ్యాఖ్యలు వైసీపీకి కాస్త ఇబ్బందిగా మారాయి. ఇప్పుడు కృష్ణప్రసాద్, కొడాలి ఎంత కవర్ చేసిన ప్రజలకు అర్ధమవ్వాల్సింది…అర్ధమైందనే చెప్పొచ్చు. ఇక మైలవరం సీటు మళ్ళీ వసంత కృష్ణప్రసాద్‌కు దక్కడం కూడా డౌటే అని తెలుస్తోంది.