కరణం వారసుడి కష్టాలు..బాబు-లోకేష్‌ టార్గెట్.!

ఎన్నో ఏళ్ల పాటు తెలుగుదేశం పార్టీలో పనిచేసిన కరణం బలరామ్ గత ఎన్నికల్లో చీరాల నుంచి గెలిచాక..వైసీపీ వైపుకు వెళ్ళిన విషయం తెలిసిందే.  తన కుమారుడు కరణం వెంకటేష్‌తో పాటు బలరామ్ వైసీపీలోకి వెళ్లారు. ఇక వైసీపీలోకి వెళ్ళాక కరణం..ఎప్పుడు కూడా చంద్రబాబుని విమర్శించిన సందర్భం లేదు. ఇటు ఏమో వల్లభనేని వంశీ, మద్దాలి గిరి లాంటి వారైతే బాబు, లోకేష్‌లని గట్టిగానే తిట్టారు.

కానీ కరణం మాత్రం అలాంటి కార్యక్రమాలు చేయలేదు. తన పని తాను చేసుకుంటూ వెళ్లారు. మరి ఏమైందో తెలియదు గాని, ఇటీవల కాలంలో కరణం వారసుడు వెంకటేష్ ప్రెస్ మీట్లు పెట్టి, జగన్‌ని పొగడటంతో పాటు చంద్రబాబు-లోకేష్‌లని టార్గెట్ చేసి విమర్శలు చేయడం మొదలుపెట్టారు. తాజాగా కూడా 2024లో కూడా బాబుకు పరాభవం తప్పదని, ఒంటరిగా పోటీ చేసే దమ్ము లేదని, బాబు కుప్పంలో, లోకేష్‌కు మంగళగిరిలో గెలిచే పరిస్తితి లేదని అన్నారు.

తండ్రికొడుకుల రాజకీయం ఇక ఉండదని, సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమం, అభివృద్ధి దేశానికే ఆదర్శం అన్నారు. అధికారం లేదన్న అక్కసుతోనే బాబు-పవన్ కుట్రలు పన్నుతున్నారని చెప్పుకొచ్చారు. మొత్తానికి కరణం కాకపోయిన వారసుడు గళం విప్పారు. ఇకపై బాబుని విమర్శించకపోతే వైసీపీలో ఇబ్బందులు వస్తాయని అనుకున్నారో లేక సీటు డౌట్ అనుకున్నారో తెలియదు గాని వెంకటేష్..బాబు-లోకేష్ టార్గెట్ గా ఫైర్ అవుతున్నారు.

అయితే కరణం వారసుడుకు సీటు విషయంలో ఇబ్బందులు ఉన్నాయి. ఇటు ఎలాగో చీరాలలో కరణం ఫ్యామిలీకి ఎదురుగా ఆమంచి కృష్ణమోహన్ ఉన్నారు. ఆ సీటు కోసం గట్టిగా ట్రై చేస్తున్నారు. పోనీ కరణం ఫ్యామిలీ సొంత స్థానం అద్దంకి సీటు అయిన దక్కుతుందా? అంటే అది డౌటే. ఎందుకంటే అక్కడ బాచిన కృష్ణచైతన్య ఉన్నారు. జగన్ దాదాపు ఆ సీటు చైతన్యకు ఫిక్స్ చేసినట్లే కనిపిస్తోంది. దీంతో కరణం వారసుడుకు సీటుపై క్లారిటీ లేదు..అందుకే ఇలా బాబు-లోకేష్‌లని తిడితే ఏదైనా క్లారిటీ వస్తుందని అనుకున్నట్లు ఉన్నారు.