జగన్ వార్నింగ్ లెక్కచేయని ఆ ఇద్దరు..!

మళ్ళీ అధికారంలోకి రావడానికి జగన్ గట్టిగానే కష్టపడుతున్నారు..ఈ సారి కూడా అధికారం దక్కించుకోవాలంటే..ఎమ్మెల్యేలు అందరూ మంచి పనితీరు కనబర్చాలని చెప్పి జగన్ పదే పదే చెబుతూ వస్తున్నారు. ఇదే క్రమంలో పలుమార్లు వర్క్ షాప్ పెట్టి..ఎమ్మెల్యేల పనితీరు వివరిస్తూనే ఉన్నారు. అలాగే ఇంకా బాగా పనిచేయాలని సలహాలు ఇస్తున్నారు. ఇక సరిగ్గా పనిచేయకపోతే నెక్స్ట్ సీటు కూడా ఇవ్వనని తేల్చి చెప్పేస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు కొందరు ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చారు.

అయితే కొందరు ఎమ్మెల్యేలు ఎన్ని వార్నింగ్‌లు ఇచ్చిన లెక్క చేయడం లేదని తెలుస్తోంది. ముఖ్యంగా ఆళ్ళ నాని, నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి..ఈ ఇద్దరి పేర్లు..ప్రతి వర్క్ షాప్‌లోనూ వినిపిస్తున్నాయి. గతంలో జరిగిన వర్క్ షాప్‌లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించడంలో ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు పూర్తిగా వెనుకబడి ఉన్నారని జగన్ స్వయంగా వెల్లడించారు. వీరు తమ పనితీరుని మెరుగు పర్చుకోవాలని సూచించారు.

కానీ ఎన్ని సార్లు చెప్పిన వీరి పనితీరు మెరుగయ్యేలా కనిపించడం లేదు. తాజాగా జరిగిన వర్క్ షాప్‌లో కూడా వీరి పేర్లు మళ్ళీ వినిపించాయి. దాదాపు 27 మంది ఎమ్మెల్యేలు గడప గడపకు వెళ్ళడం లేదని. అనుకున్న టార్గెట్‌లో కనీసం 25 శాతం కూడా పూర్తి చేయడం లేదని జగన్ చెప్పుకొచ్చారట. అయితే ఆ 27 మంది ఎమ్మెల్యేలు చెప్పలేదని కొందరు మాట్లాడుతున్నారు. కానీ టీడీపీ అనుకూల మీడియాలో జగన్..వారి పేర్లు చెప్పారని ప్రచారం జరుగుతుంది.

ఇందులో మంత్రులైన రోజా, బుగ్గన, దాడిశెట్టి, విశ్వరూప్, వనిత పేర్లు కూడా ఉన్నాయని తేలింది. అలాగే ఎమ్మెల్యేల్లో మళ్ళీ కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పేరు వినిపించగా, అలాగే ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ళ నాని పేరు కూడా వినిపించింది. అంటే జగన్ వార్నింగ్ ఇచ్చినా సరే..వీరిలో మార్పు రాలేదని తెలుస్తోంది. వీరి విషయంలో చివరికి జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.