కాకినాడలో మళ్ళీ తమ్ముళ్ళ లొల్లి..పగ్గాలు ఎవరికి?

కాకినాడ రూరల్ నియోజకవర్గంలో తమ్ముళ్ళ మధ్య మళ్ళీ లొల్లి మొదలైంది. 2019 ఎన్నికల తర్వాత నుంచి ఇక్కడ ఏదొకరకంగా రచ్చ నడుస్తూనే ఉంది. 2014లో టీడీపీ తరుపున ఎమ్మెల్యేగా గెలిచిన పిల్లి అనంత లక్ష్మీ..2019లో ఓడిపోయారు. ఓడిపోయిన కొన్ని రోజుల తర్వాత..టీడీపీలోని కొందరు నేతలు తమని తోక్కేయాలని చూస్తున్నారని చెప్పి..తన భర్తతో కలిసి అనంతలక్ష్మీ పార్టీ నుంచి బయటకొచ్చారు.

ఇక అప్పటినుంచి నియోజకవర్గంలో పార్టీని కింది స్థాయి నేతలే నడిపిస్తున్నారు. అలాగే కాకినాడ పార్లమెంట్ అధ్యక్షుడు జ్యోతుల నవీన్..ఇక్కడ పార్టీ కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. అటు మాజీ మేయర్ పావని సైతం తనదైన శైలిలో ముందుకెళుతున్నారు. ఇటీవలే టీడీపీలో చేరిన ముద్రగడ పద్మనాభం అనుచరుడు వాసిరెడ్డి ఏసుదాసు సైతం కాకినాడ రూరల్‌లో యాక్టివ్ గా పనిచేస్తున్నారు. అటు టీడీపీ నేత పేరాబత్తుల రాజశేఖర్ సైతం ఉన్నారు. ఇలా నలుగురు కాపు నేతలు కాకినాడలో ఎవరి దారిలో వారు పనిచేసుకుంటున్నారు.

ఇలా ఉండగానే ఇటీవల సడన్ గా మళ్ళీ పిల్లి దంపతులు పార్టీలోకి ఎంట్రీ ఇచ్చారు. సడన్ గా వచ్చి సీటు తమదే అని ప్రచారం మొదలుపెట్టారట. ఇదే క్రమంలో రెండేళ్ళు పార్టీని గాలికొదిలేసి ఇప్పుడు వస్తే లాభం లేదని మిగిలిన నేతలు ఫైర్ అవుతున్నారు. ఈ మధ్య కాకినాడ రూరల్ లోని పార్టీ ఆఫీసులో జరిగిన సమావేశంలో కూడా పెద్ద రచ్చ నడిచిందని తెలిసింది. పిల్లి వర్గానికి, వ్యతిరేక వర్గానికి మధ్య గొడవ జరిగిందని తెలిసింది.

ఇక పిల్లి ఫ్యామిలీ వెనుక యనమల రామకృష్ణుడు ఉండగా, పిల్లి వ్యతిరేక వర్గం వెనుక చినరాజప్ప ఉన్నారని తెలుస్తోంది. అయితే ఈ సీటు పిల్లి ఫ్యామిలీ దక్కేలా చేయాలని యనమల ట్రై చేస్తున్నారట. అలా కాకుండా కాపు నేతకు సీటు దక్కాలని రాజప్ప ట్రై చేస్తున్నారట. నలుగురు కాపు నేతల్లో ఎవరికొకరికి సీటు వచ్చేలా చేయాలని చూస్తున్నారట. మరి ఈ సీటు విషయంలో చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు..చివరికి ఎవరికి సీటు ఇస్తారో చూడాలి.