బాబుపై ‘గూడెం’ తమ్ముళ్ళకు డౌట్..!

నెక్స్ట్  ఎన్నికల్లో జనసేనతో పొత్తు ఉంటుందా? ఉండదా? ఉంటే పరిస్తితి ఎలా ఉంటుంది…లేకపోతే పరిస్తితి ఎలా ఉంటుంది? అనే అంశాలపై టీడీపీలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. పొత్తు ఉంటే మాత్రం అడ్వాంటేజ్ ఉంటుంది..అటు జనసేనకైనా, ఇటు టీడీపీకైనా ప్లస్సే. అదే సమయంలో పొత్తు లేకపోతే రెండు పార్టీలకు నష్టమే. కానీ ఇక్కడ పొత్తు ఉంటే జనసేనకు జరిగే నష్టం ఏమి లేదు గాని..టీడీపీకి మాత్రం నష్టం జరిగే ఛాన్స్ ఉంది.

ఎందుకంటే టీడీపీకి రాష్ట్ర వ్యాప్తంగా బలంగా ఉంది..175 సీట్లలో నాయకులు ఉన్నారు. పొత్తు ఉంటే టీడీపీ కొన్ని సీట్లు వదులుకోవాలి. అప్పుడు కొందరు నాయకులు త్యాగం చేయాలి. అయితే పొత్తు విషయంలో ప్రస్తుతానికి క్లారిటీ రావడం లేదు. అయినా సరే కొన్ని నియోజకవర్గాల్లో తమ్ముళ్ళకు డౌట్ ఉన్నట్లు కనిపిస్తోంది. చంద్రబాబు తప్పనిసరిగా పవన్‌తో కలిసే అవకాశాలు ఉన్నాయని, ఎన్నికల సమయంలో పొత్తు ఉంటుందని, అలాగే కొన్ని సీట్లు జనసేనకు ఇవ్వాల్సిందే అని అనుకుంటున్నారు. అదే సమయంలో జనసేనకు ఏ ఏ సీట్లు దక్కుతాయనేది తమ్ముళ్ళకు కాస్త క్లారిటీ ఉంది.

ముఖ్యంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కొన్ని సీట్లు జనసేనకు ఇచ్చే ఛాన్స్ ఉంది. ఇదే క్రమంలో తాడేపల్లిగూడెం సీటు జనసేనకు వదిలే ఛాన్స్ ఉందని తమ్ముళ్ళు డౌట్ పడుతున్నారు. 2014లో పొత్తులో భాగంగా ఈ సీటు బీజేపీకి వదిలారు. 2019లో వైసీపీ-టీడీపీ-జనసేన ట్రైయాంగిల్ ఫైట్ జరిగింది. ఈ ఫైట్‌లో వైసీపీ గెలిచింది. అయితే ఇక్కడ వైసీపీ-జనసేన మధ్య గట్టి ఫైట్ నడుస్తోంది.

టీడీపీ అంతగా పోరాటం చేయడం లేదు. కీలక నేతలు ఈలి నాని, ముళ్ళపూడి బాపిరాజులు ఎప్పుడో సైడ్ అయ్యారు. ప్రస్తుతానికి వలవల బాబ్జీ ఇంచార్జ్ గా ఉన్నారు. ఈయన ఏదో మొక్కుబడిగా కార్యక్రమాలు చేస్తున్నారు. అయినా టీడీపీ కార్యకర్తలు ఇక్కడ దూకుడుగా లేరు. ఈ సీటు ఖచ్చితంగా జనసేనకు కేటాయిస్తారని, కాబట్టి ఇక్కడ ఎంత పనిచేసిన వేస్ట్ అని తమ్ముళ్ళు డిసైడ్ అయినట్లు కనిపిస్తున్నారు.