ఎంపీగానే బాలయ్య చిన్నల్లుడు..!

గత కొన్ని రోజులుగా బాలయ్య చిన్నల్లుడు శ్రీభరత్ సీటు విషయంలో అనేక రకాల కథనాలు వస్తున్న విషయం తెలిసిందే. లోకేష్ కంటే బాగా మాట్లాడగల భరత్‌ని రాజకీయంగా ఎదగనివ్వకూడదని చంద్రబాబు, లోకేష్ చూస్తున్నారని, అందుకే నెక్స్ట్ ఎన్నికల్లో భరత్‌కు సీటు ఇవ్వకూడదని డిసైడ్ అయ్యారని..పొత్తు ఉంటే విశాఖ ఎంపీ సీటు జనసేనకు ఇవ్వాలని లేని పక్షంలో బీసీ వర్గానికి చెందిన పల్లా శ్రీనివాస్‌కు విశాఖ ఎంపీ సీటు ఇవ్వాలని చూస్తున్నారని వైసీపీ అనుకూల మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వస్తున్నాయి.

గత ఎన్నికల్లో భరత్ చాలా తక్కువ ఓట్ల మెజారిటీతో విశాఖ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఇక వచ్చే ఎన్నికల్లో కూడా అక్కడ నుంచే పోటీ చేయాలని భరత్ చూస్తున్నారని, లేదంటే భీమిలి సీటు అడుగుతున్నారని ప్రచారం జరుగుతుంది. అయితే ఏ సీటు కూడా భరత్‌కు ఇవ్వడం లేదని వైసీపీ అనుకూల మీడియాలో ప్రచారం జరుగుతుంది. విశాఖలో పల్లాని, భీమిలిలో కోరాడ రాజాబాబుని నిలబెట్టడానికి చూస్తున్నారని, భరత్‌కు మాత్రం సీటు ఇవ్వరని కథనాలు వస్తున్నాయి.

గీతం విద్యాసంస్థల ఛైర్మన్‌గా ఉన్న భరత్‌కు..విశాఖలో మంచి పట్టు ఉంది. ఆయన తాత. ఎం‌వి‌వి మూర్తి..ఎన్నో ఏళ్ళు టీడీపీలో పనిచేశారు. దీంతో భరత్ ఫ్యామిలీకి విశాఖపై మంచి పట్టు ఉంది. పైగా బాలయ్య అల్లుడు కూడా కావడంతో ఇంకా అడ్వాంటేజ్ వచ్చింది. అలాగే ప్రస్తుత రాజకీయాలపై భరత్‌కు అవగాహన ఉంది..నిర్మాణాత్మకమైన రాజకీయాలు చేస్తారు. మంచివక్త కూడా. కాబట్టే ఈయన..లోకేష్‌ని డామినేట్ చేస్తారని చెప్పి..సీటు ఇవ్వడం లేదని ప్రచారం మొదలైంది.

కానీ అధికారికంగా మాత్రం భరత్ సీటు విషయంలో ఎలాంటి ప్రకటన రాలేదు. అయితే అదంతా వైసీపీ కావాలని చేస్తున్న ప్రచారమని, మళ్ళీ భరత్ విశాఖ ఎంపీగానే బరిలో దిగుతారని టీడీపీ శ్రేణులు సోషల్ మీడియా వేదికగా కౌంటర్లు ఇస్తున్నాయి. జనసేనతో పొత్తు ఉన్నా సరే విశాఖ సీటు టీడీపీ తీసుకుంటుందని, భరత్ మళ్ళీ పోటీ చేసి సత్తా చాటుతారని అంటున్నారు. మరి చూడాలి భరత్ విషయంలో బాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో.