టీడీపీ కోటల్లో స్పెషల్ సర్వేలు!

జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి టీడీపీని పునాదులతో పెకిలించి వేయడమే లక్ష్యంగా రాజకీయం చేస్తున్న విషయం తెలిసిందే. ఎవరు అవునన్నా, కాదన్నా అసలు టీడీపీనే లేకుండా చేయాలనే లక్ష్యంగా జగన్ ముందుకెళుతున్నారు. ఈ క్రమంలో జగన్ ఎలాంటి రాజకీయ క్రీడలకు తెరలేపారో కూడా తెలిసిందే. జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి టీడీపీ నేతలకు చుక్కలు కనబడుతున్నాయి. ఎక్కడక్కడ చంద్రబాబుని చావు దెబ్బ తీస్తున్నారు.

ఇక గత ఎన్నికల్లో టీడీపీ కనీసం 23 సీట్లని గెలుచుకుంది..కానీ ఈ సారి ఒక్క సీటు గెలవకూడదనే టార్గెట్ పెట్టుకున్నారు. 175కి 175 సీట్లు మనమే గెలుచుకోవాలని ఇప్పటికే వైసీపీ నేతలకు జగన్ పిలుపునిచ్చారు. ఆ దిశగానే జగన్ ముందుకెళుతున్నారు. అసలు కుప్పంలోనే పంచాయితీ, పరిషత్ ఎన్నికలు వన్ సైడ్ గా గెలుచుకున్నాం. అలాంటప్పుడు నెక్స్ట్ కుప్పంతో కలిపి 175కి 175 సీట్లు ఎందుకు గెలుచుకోలేమని అంటున్నారు.

మొత్తానికి టీడీపీకి ఈ సారి ఒక్క సీటు కూడా దక్కకుండా చేయాలనేది జగన్ టార్గెట్. అందుకే టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేల స్థానాలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టి పనిచేస్తున్నారు. ఎలాగో కుప్పంపై గట్టిగా ఫోకస్ చేశారు. అలాగే టీడీపీ ఇంకా బలంగా ఉన్న స్థానాలపై ఫోకస్ పెట్టి, పీకే టీం ద్వారా స్పెషల్ సర్వేలు చేయిస్తున్నారట. ఆ స్థానాల్లో టీడీపీ ఇంకా ఎందుకు బలంగా ఉంది…వైసీపీ బలపడటం లేదు..అలాగే గత ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడానికి కారణాలు ఏంటి? ఈ సరి ఎలా రాజకీయం చేస్తే ఆ స్థానాల్లో గెలవచ్చు అనే అంశాలపై జగన్ సర్వేలు చేయిస్తున్నారట.

పర్చూరు, కొండపి, అద్దంకి, రేపల్లె, విజయవాడ ఈస్ట్, పాలకొల్లు, ఉండి, రాజమండ్రి సిటీ, రూరల్, పెద్దాపురం, మండపేట, విశాఖ సిటిలోని స్థానాలు, టెక్కలి, ఇచ్చాపురం, హిందూపురం, ఉరవకొండ స్థానాలపై స్పెషల్ గా సర్వేలు చేయిస్తున్నారని తెలుస్తోంది. ఈ సారి ఈ స్థానాల్లో ఖచ్చితంగా గెలవాలని టార్గెట్ పెట్టుకున్నారు. మరి జగన్ టార్గెట్ సక్సెస్ అవుతుందో లేదో చూడాలి.