మాజీ మంత్రులకు లక్కీ ఛాన్స్?

రాజకీయాల్లో మంత్రులందరికి పూర్తి స్థాయిలో ప్రజా మద్ధతు అనేది పూర్తిగా దక్కడం కష్టమని చెప్పొచ్చు. అధికారం వచ్చాక కొందరు మంత్రులు ప్రజల పనులు పక్కన పెట్టి సొంత పనులు చక్కదిద్దుకోవడంపైనే ఎక్కువ ఫోకస్ పెడతారు. అలాగే మంత్రులుగా ఉంటూ రాష్ట్ర స్థాయిలో పనిచేస్తూ సొంత నియోజకవర్గాలని పెద్దగా పట్టించుకోరు. దీని వల్ల సొంత స్థానాల్లో వ్యతిరేకత తెచ్చుకుంటారు. ఆ దెబ్బతో ఎన్నికల్లో మంత్రులు గెలవడం కష్టమైపోతుంది.

గత ఎన్నికల్లో కూడా టీడీపీ ప్రభుత్వానికి చెందిన మంత్రులు దారుణంగా ఓడిపోయారు. కేవలం ముగ్గురు మాత్రమే మళ్ళీ గెలిచారు. టెక్కలిలో అచ్చెన్నాయుడు, పెద్దాపురంలో నిమ్మకాయల చినరాజప్ప, విశాఖ నార్త్‌లో గంటా శ్రీనివాసరావు మాత్రమే గెలిచారు. మిగిలిన వారు ఓటమి పాలయ్యారు. అయితే ఇప్పుడు ఏపీలో రాజకీయ పరిస్తితులు మారుతున్నాయి. అధికారంలో ఉన్న వైసీపీపై వ్యతిరేకత కాస్త పెరుగుతూ వస్తుంది. ఈ క్రమంలో టీడీపీ పుంజుకుంటుంది. అలాగే టీడీపీకి చెందిన మాజీ మంత్రులు కూడా కొందరు పుంజుకుంటున్నారు.

ప్రస్తుత పరిస్తితుల్లో టెక్కలిలో అచ్చెన్నకు, పెద్దాపురంలో రాజప్పకు ఇబ్బంది లేదు. మళ్ళీ ఈ ఇద్దరికీ గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. గంటా నెక్స్ట్ ఎక్కడ పోటీ చేస్తారో? ఏ పార్టీలో పోటీ చేస్తారో క్లారిటీ లేదు. ఇక టీడీపీలో మిగిలిన మాజీ మంత్రుల గురించి ఒక్కసారి చూసుకుంటే…ఆచంటలో పితాని సత్యనారాయణ, మచిలీపట్నంలో కొల్లు రవీంద్రలకు గెలుపు అవకాశాలు మెండుగా ఉన్నాయి.

అలాగే మైలవరంలో దేవినేని ఉమా, నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడు, ఎచ్చెర్లలో కిమిడి కళా వెంకట్రావు, చిలకలూరిపేటలో ప్రత్తిపాటి పుల్లారావు, వేమూరులో నక్కా ఆనందబాబులకు గెలుపు అవకాశాలు ఉన్నాయని తాజా సర్వేలో తేలింది. ఇక పలమనేరులో అమర్నాథ్ రెడ్డి, పెనుకొండలో పార్థసారథికు కాస్త అవకాశాలు ఉన్నాయి. ఇక మాజీ మంత్రులైన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, భూమా అఖిలప్రియ, కిడారి శ్రావణ్ కుమార్ లాంటి వారికి మళ్ళీ గెలుపు అవకాశాలు తక్కువ ఉన్నాయి. ఏదేమైనా ఈ సరి టీడీపీ మాజీ మంత్రులకు లక్కీ ఛాన్స్ దొరికేలా ఉంది.