ఎంపీ కోట‌గిరితో ఎమ్మెల్యే ఎలీజా రాజీ ఫార్ములా…!

ఏలూరు జిల్లా చింతలపూడి రిజర్వ్ అసెంబ్లీ నియోజకవర్గంలో అధికార వైసీపీలో గ్రూపుల గోల గత రెండున్నర సంవత్సరాలగా పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది. స్థానిక ఎమ్మెల్యే ఎలిజాకు ఇదే నియోజకవర్గానికి చెందిన ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధ‌ర్‌కు మధ్య పచ్చగడ్డి వేస్తే భ‌గ్గుమంటూ వస్తోంది. చివరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో పలు కీలక పంచాయతీల‌లో అధికార పార్టీలోనే ఉండి కూడా ఈ రెండు గ్రూపులు వేరువేరుగా పోటీ చేసే పరిస్థితి వచ్చింది. ఓవైపు పార్టీ నష్టపోతున్న ఆధిపత్య పోరాటం విషయంలో ఎంపీ వర్గం.. ఎమ్మెల్యే వర్గం వెనక్కి తగ్గక పోవడంతో వైసిపి నియోజకవర్గంలో నిట్ట నిలువునా రెండుగా చీలిపోయింది.

Eluru Lok Sabha Election Results 2019 Andhra Pradesh: YSR Congress's Kotagiri Sridhar wins by significant margin

సాధారణ ఎన్నికల తర్వాత కూడా ఎమ్మెల్యే ఎలీజా వర్సెస్ ఎంపీ కోటగిరి వర్గాలు నియోజకవర్గంలో ఢీ అంటే ఢీ అనేలా వ్యవహరించాయి. తాను నియోజకవర్గ ఎమ్మెల్యే అని.. నియోజకవర్గంలో ప్రభుత్వం కార్యక్రమాలు, పార్టీ పరంగా తాను చెప్పిందే సుప్రీం అంటూ ఎలీజా పంతానికి పోయారు. అటు ఎంపీ శ్రీధర్ సైతం చింతలపూడి తమ సొంత నియోజకవర్గం అని.. తమ తండ్రి మాజీ మంత్రి కోటగిరి విద్యాధరరావు తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి నాలుగు దశాబ్దాలుగా తమ కుటుంబాన్ని నమ్ముకున్న ఎంతోమంది కార్యకర్తలు, ప్రజలు ఇక్క‌డ‌ ఉన్నారని వారికి తాము ఎప్పుడు అండగా ఉండాల్సిన అవసరం ఉందని శ్రీధర్ పట్టుబడుతూ వచ్చారు.

ఈ పోరులో చివరివరకు ఎవరు వెనక్కు తగ్గేలా లేదు. అయితే ఎమ్మెల్యే హోదాలో ఎలీజా శ్రీధర్ వర్గానికి పదవులు ద‌క్క‌కుండా ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. అయితే ఇటీవల గోదావరి జిల్లాల పార్టీ సమన్వయకర్త, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి సమక్షంలో ఈ రెండు వర్గాల నేతల మధ్య ఏలూరులో పంచాయితీ జరిగింది. మాజీ మంత్రి రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ ఎంపీ మిధున్ రెడ్డి సమక్షంలో రెండు వర్గాల నాయకులు ఒకానొక దశలో కొట్టుకునేందుకు కూడా సిద్ధమయ్యారు. అయితే ఎంపీ శ్రీధర్ జోక్యం చేసుకుని సర్ది చెప్పడంతో గొడవ సద్దుమణిగింది. ఎమ్మెల్యే పై ఫిర్యాదు చేసేందుకు కొందరు ప్రయత్నించినా ఎంపీ శ్రీధర్ మాత్రం వారిని సావధానంగా కూర్చోబెట్టి తన రాజకీయ చాతుర్యాన్ని ప్రదర్శించారు.

Mithun Reddy Archives | Telugu360.com

మిథున్ రెడ్డి దగ్గర జరిగిన పంచాయితీ తర్వాత ఎమ్మెల్యే ఎలీజా, ఎంపీతో పాటు ఆయన వర్గంతో రాజీ ధోరణితోనే ఉన్నట్టు నియోజకవర్గ వైసీపీలో ప్రచారం జరుగుతుంది. ఈ పంచాయితీకి ముందు వరకు కాస్త దూకుడుగానే ఉన్న ఎమ్మెల్యే వర్గం ఇప్పుడు ఆచితూచి అడుగులు వేసే ధోరణితో ఉంది. ఎంపీ మిథున్ రెడ్డి నియోజకవర్గంలోని జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీతో పాటు నాలుగు మండలాల్లోనూ ఎంపీ వర్గం నేతలను కూడా కలుపుకుని ముందుకు వెళ్లాలని ఎమ్మెల్యేకు పలు సూచనలు చేసినట్టు తెలిసింది. మిథున్ రెడ్డి సూచనల తర్వాత ఎలీజా సైతం వచ్చే సాధారణ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఎంపీ శ్రీధర్ వర్గంతో సమన్వయం చేసుకునే ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఆదిశగానే ఆయన తాజా అడుగులు కూడా పడుతున్నాయి.

ఎవరు అనుకున్నా… కాదనుకున్నా నియోజకవర్గంలో ఎంపీ వర్గం చాలా బలంగా ఉంది. అది గత ఎన్నికల ముందు నుంచి మాత్రమే కాదు.. మూడు దశాబ్దాలుగా కోటగిరికి చింతలపూడిలో బలమైన అనుచరగ‌ణం ఉంది. గత ఎన్నికల్లో ఎలీజాకు భారీ మెజార్టీ రావడంలో ఆ వర్గం ఎంత బలంగా పనిచేసిందో ఆయనకు తెలుసు. అందుకే వచ్చే సాధారణ ఎన్నికల్లో తాను అంతే భారీ మెజార్టీతో విజయం సాధించి… మరోసారి చింతలపూడిలో తన జెండా పాతుకోవాలంటే ఎంపీ వర్గంతో సయోధ్య‌తో ఉండాలన్న నిర్ణయానికి ఆయ‌న‌ వచ్చినట్టు తెలుస్తోంది. మ‌రి ఈ పంచాయితీతో అయినా చింత‌ల‌పూడి వైసీపీ గ్రూప్ వార్‌కు చెక్ ప‌డుతుందో ? లేదో ? చూడాలి.

Share post:

Latest