టాలీవుడ్ రెండు నిర్మాతల గ్రూప్స్ త్వరలో కలిసిపోనున్నాయా? కొత్తవాటికి అధ్యక్షులు ఎవరో?

కరోనా తరువాత చాలా పరిశ్రమలు కుదేలయ్యాయి. అందులో తెలుగు సినీ పరిశ్రమ ఒకటి. ఈమధ్యకాలంలో పలు సినిమాలు రిలీజైనా ఫలితం అంతంతమాత్రమే. ఒక్క ఆగష్టు నెలలోనే దాదాపు 16 సినిమాలు రిలీజ్ అవ్వగా అందులో కేవలం మూడంటే మూడు సినిమాలు హిట్ టాక్ తెచ్చుకున్నాయి. మిగతా సినిమాలు ఎప్పుడు రిలీజ్ అయ్యాయో కూడా తెలియదు. మొన్నటికి మొన్న తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ గిల్డ్ అకస్మాత్తుగా షూటింగులు నిలివివేసిన సంగతి అందరికీ తెలిసినదే.

ఇకపోతే తెలుగు చిత్ర సీమలో నెలకొన్న సమస్యలపై చర్చల పర్వం ఇంకా ముగిసినట్టు కనబడటం లేదు. తాజాగా మరో సమస్యపై చర్చలకు సిద్దమవుతున్నారు నిర్మాతల మండలి సభ్యులు. పారితోషికాలు, ప్రొడక్షన్‌ కాస్ట్‌ ఇతర సమస్యలపై నెల రోజులుగా చర్చలు జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే! ఆ రిపేర్లు ఇంకా ఓ కొలిక్కి రాకముందే మూవీ టవర్స్‌ స్టేటస్ పై చర్చ మొదలుపెట్టనున్నారు. ఈ మేరకు ఈ నెల ఆరో తేదీన నిర్మాత మండలి రెగ్యులర్‌ సభ్యులంతా సమావేశం కానున్నారు.

సౌత్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ ఛాంబర్‌ భవన నిర్మాణం, దానికి సంబంధించిన ఫండింగ్‌ తదితర అంశాలపై ఇక్కడ చర్చించనున్నారు. యాక్టివ్‌ ప్రొడ్యూసర్‌ ఏర్పాటు చేసుకున్న గిల్డ్‌ను నిర్మాతల మండలిలో విలీనం చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇండస్ట్రీలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి నిర్మాతల మండలి, గిల్డ్‌ సభ్యులు కలిసి.. పరిశ్రమను ఎలా ముందుకు తీసుకెళ్లాలి అన్నదానిపై కలిసి నిర్ణయాలు తీసుకున్నారు. తాజా పరిస్థితులు చూస్తుంటే నిర్మాతల మండలి, ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌ కలిసి పని చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు కనిపిస్తోంది.