కోలగట్ల వారసురాలు రెడీ..?

విజయనగరం అంటే అశోక్ గజపతి రాజు కంచుకోట అని అందరికీ గుర్తొస్తుంది. విజయనగరం అసెంబ్లీలో అశోక్ గజపతి రాజుకు తిరుగులేదనే సంగతి తెలిసిందే. 1978 నుంచి అశోక్ అక్కడ తిరుగులేని విజయాలు సాధిస్తూ వచ్చారు. కానీ 2004 ఎన్నికల్లో అనూహ్యంగా కాంగ్రెస్ లో సీటు రాకపోవడంతో కోలగట్ల వీరభద్రస్వామి ఇండిపెండెంట్ గా పోటీ చేసి..కేవలం 1126 ఓట్ల తేడాతో అశోక్‌పై గెలిచి ఎమ్మెల్యే అయ్యారు.

ఇక 2009లో కోలగట్ల కాంగ్రెస్ నుంచి పోటీ చేసి అశోక్‌పై ఓడిపోయారు. 2014 ఎన్నికలోచ్చేసరికి అశోక్..విజయనగరం ఎంపీగా పోటీ చేసి గెలిచారు. విజయనగరం అసెంబ్లీలో మీసాల గీత టీడీపీ నుంచి పోటీ చేసి కోలగట్లపై విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో మాత్రం కోలగట్లకు విజయం దక్కింది. అశోక్ కుమార్తె అతిథిపై దాదాపు 6 వేల ఓట్ల పైనే మెజారిటీతో కోలగట్ల గెలిచారు. ఎంతో సీనియర్ నాయకుడైన కోలగట్లకు మంత్రి పదవి వస్తుందని అంతా అనుకున్నారు. కానీ మొదట విడతలో రాలేదు..రెండో విడతలో కూడా రాలేదు.

అయితే తాజాగా జగన్..డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చారు. డిప్యూటీ స్పీకర్ పదవికి కోన రఘుపతి రాజీనామా చేయడంతో..కోలగట్లకు డిప్యూటీ స్పీకర్ పదవి దక్కింది. ఇంకా ఈ పదవితోనే కోలగట్ల సరిపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే నెక్స్ట్ ఎన్నికల్లో కోలగట్ల పోటీ చేయడానికి సన్నద్ధంగా ఉన్నట్లు కనిపించడం లేదు. వయసు మీద పడటంతో..ఆయన కుమార్తె శ్రావణిని రంగంలోకి దించుతారని తెలుస్తోంది.

ఇప్పటికే శ్రావణి విజయనగరంలో యాక్టివ్ గా పనిచేస్తున్నారు..అధికార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. తన తండ్రి బదులు..తానే నియోజకవర్గంలో తిరుగుతున్నారు. దీని బట్టి చూస్తే నెక్స్ట్ కోలగట్ల వారసురాలు ఎన్నికల బరిలో దిగే అవకాశాలు ఉన్నాయి. అటు అశోక్ వారసురాలు అతిధి ఎలాగో..దూకుడుగా రాజకీయం చేస్తున్నారు. ఇక ఈ సారి వారసురాళ్ళ మధ్య గట్టి పోటీ నడవనుంది. మరి ఈ పోటీలో ఎవరు పై చేయి సాధిస్తారో చూడాలి.