వంశీపై దేవినేని చందు..ఛాన్స్ ఉంటుందా?

టీడీపీలో రాజకీయంగా ఎదిగి..తమకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్ తెచ్చుకుని వైసీపీలోకి వెళ్ళి..అదే టీడీపీపై, చంద్రబాబుపై కొందరు నేతలు తీర్వ స్థాయిలో విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా కొడాలి నాని, వల్లభనేని వంశీలు..ఈ ఇద్దరు నేతలు మొదట టీడీపీలోనే రాజకీయ జీవితం మొదలుపెట్టిన విషయం తెలిసిందే. అలాగే టీడీపీలోనే రెండు సార్లు ఎమ్మెల్యేలుగా గెలిచారు. టీడీపీలోనే సొంత బలాన్ని పెంచుకున్నారు.

ఆ తర్వాత వైసీపీలోకి వెళ్ళి ఈ ఇద్దరు నేతలు…చంద్రబాబుని ఎలా తిడుతున్నారో తెలిసిందే. తిట్టడం అంటే అలా ఇలా కాదు..కుటుంబంలోని అందరినీ కలిపి తిడుతున్నారు. ఇక వీరికి టీడీపీ నేతలు కూడా గట్టిగానే కౌంటర్లు ఇస్తున్నారు. అయినా సరే కొడాలి, వల్లభనేని తగ్గేదెలే అన్నట్లు ముందుకెళుతున్నారు. ఈ క్రమంలోనే వీరికి ఎలాగైనా చెక్ పెట్టాలని టీడీపీ నేతలు చూస్తున్నారు. ముఖ్యంగా కృష్ణా జిల్లా టీడీపీ శ్రేణులు..వీరిపై రగిలిపోతున్నారు.

వీరిని ఖచ్చితంగా ఓడించాలని పంతం పట్టి కూర్చున్నారు. ఇక జిల్లా నాయకులు సైతం…వీరికి ఎలాగైనా చెక్ పెడతామని, నెక్స్ట్ ఓడించి తీరుతామని తొడలు కొడుతున్నారు. ఈ క్రమంలో నెక్స్ట్ కొడాలి, వంశీలపై టీడీపీ నుంచి బలమైన అభ్యర్ధులు బరిలో దిగుతారని ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతానికి గుడివాడలో రావి వెంకటేశ్వరరావు, గన్నవరంలో బచ్చుల అర్జునుడు ఇంచార్జ్‌లుగా ఉన్నారు. కానీ వీరికి..నాని, వంశీలకు చెక్ పెట్టే సత్తా రావడం లేదు.

ఈ క్రమంలోనే విజయవాడ టీడీపీలో కీలకంగా ఉన్న దేవినేని చంద్రశేఖర్(చందు)..పార్టీ అధిష్టానం ఆదేశిస్తే..విజయవాడ ఈస్ట్‌లో దేవినేని అవినాష్‌పై లేదా గన్నవరంలో వల్లభనేని వంశీపై పోటీ చేయడానికి రెడీ అని ప్రకటించారు. ఎలాగో ఈస్ట్‌లో టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఉన్నారు. అక్కడ పోటీ చేయడం వీలు కాదు.

మరి అలా అని గన్నవరం సీటు ఇస్తారా? అంటే అది చెప్పలేని పరిస్తితి. జిల్లాలో చాలామంది సీనియర్లు ఉన్నారు. కాకపోతే 40 శాతం యువతకే సీట్లు అని బాబు ప్రకటించారు. ఈ క్రమంలో గన్నవరం సీటు చందుకు కేటాయించే అవకాశాలు కూడా లేకపోలేదు. లోకేష్ టీమ్‌లో కీలకంగా ఉన్న చందుకు సీటు దక్కుతుందో లేదో చూడాలి.