డిప్యూటీ సీఎంకే సెగలు..దెబ్బ పడుతుందా..!

అధికార వైసీపీలో ఎక్కడకక్కడ అసంతృప్తి సెగలు పెరుగుతున్న విషయం తెలిసిందే. చాలా నియోజకవర్గాల్లో నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా చాలా గ్రూపులు వస్తున్నాయి. సొంత పార్టీ ఎమ్మెల్యేలపైనే నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అటు కొన్ని చోట్ల సీటు కోసం రచ్చ నడుస్తోంది. ఇలా చాలా నియోజకవర్గాల్లో నేతల మధ్య పోరు నడుస్తోంది. ఇదే క్రమంలో డిప్యూటీ సీఎం నారాయణస్వామి ప్రాతినిధ్యం వహిస్తున్న గంగాధర నెల్లూరులో సైతం వైసీపీలో గ్రూపు రాజకీయం నడుస్తోంది.

నారాయణస్వామికి వ్యతిరేకంగా పలు గ్రూపులు నియోజకవర్గంలో పుట్టుకొచ్చాయి. నియోజకవర్గంలో పలు మండలాల్లో నేతలు…నారాయణస్వామి పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎస్సీ రిజర్వడ్ స్థానంగా ఉన్న జీడీ నెల్లూరులో మాజీ ఎంపీ మహాసముద్రం జ్ఞానేంద్రరెడ్డి సెపరేట్‌గా గ్రూపు రాజకీయం నడిపిస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికే పలు మండలాల్లో నారాయణస్వామికి వ్యతిరేకంగా కొందరు నేతలు పనిచేస్తున్నారు. అలాగే మాజీ ఎంపీ గ్రూపు కూడా ఫుల్ యాక్టివ్ అయింది.

ఇటీవల వైసీపీ మండల అధ్యక్షుల జాబితాను నారాయణస్వామి ప్రకటించారు. ఈ జాబితా విషయంలో మాజీ ఎంపీ తీవ్ర అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది. ఈ విషయంపై మాజీ ఎంపీ  వర్గం వారు డైరక్ట్ గానే డిప్యూటీ సీఎంపై విమర్శలు చేస్తున్నారు. దీనికి డిప్యూటీ సీఎం కూడా కౌంటర్ ఇస్తున్నారు. పార్టీకి వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడినా..పార్టీ నుంచి బహిష్కరిస్తామని వార్నింగ్ ఇచ్చారు.

అటు మాజీ ఎంపీ అనుచరులు…మరింతగా వార్నింగ్ ఇస్తున్నారు..తామంతా జగనన్న సైనికులం అని, జ్ఞానేందర్‌రెడ్డి కుటుంబం కోసం చావడానికైనా చంపడానికైనా సిద్ధమంటూ సోషల్ మీడియాలో సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. అలాగే మాజీ ఎంపీ జ్ఞానేందర్ రెడ్డి సెపరేట్ గా నియోజకవర్గంలో సమావేశాలు పెడుతున్నట్లు తెలుస్తోంది. నారాయణస్వామికి వ్యతిరేకంగా ఉన్నవారంతా సమావేశాల్లో పాల్గొంటున్నట్లు తెలిసింది. ఇక నియోజకవర్గంలో నారాయణస్వామి వల్ల పార్టీకి ఎక్కువ నష్టం జరుగుతుందని, ఈ విషయంపై అధిష్టానానికి కూడా ఫిర్యాదు చేయడానికి సిద్ధమవుతున్నారట. మొత్తానికి డిప్యూటీ సీఎంకే అసంతృప్తి సెగలు గట్టిగా తగులుతున్నాయి. ఇది ఇలాగే కొనసాగితే నెక్స్ట్ ఎన్నికల్లో నారాయణస్వామికే డేంజర్.