పురంధేశ్వరి..టీడీపీని కాపాడుతున్నారా?

రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో దగ్గుబాటి ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎన్టీఆర్ పెద్ద కుమార్తె పురంధేశ్వరి, ఆమె భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు..గురించి అందరికీ తెలుసు. అయితే ఒకప్పుడు ఈ ఫ్యామిలీకి రాజకీయంగా తిరుగులేదు..కానీ ఇప్పుడు ఈ ఫ్యామిలీ ఫ్యూచర్ ఏంటి అనే పరిస్తితి వచ్చింది. టీడీపీలో ఉండగా వీరికి తిరుగు లేదు. ఆ తర్వాత చంద్రబాబుతో విభేదించి…వీరు కాంగ్రెస్‌లోకి వచ్చారు. అక్కడ కూడా వీరికి బాగా ప్రాధాన్యత దక్కింది.

అలాగే పురంధేశ్వరికి కేంద్ర మంత్రి పదవి కూడా దక్కింది. కానీ రాష్ట్ర విభజనతో ఈ ఫ్యామిలీకి కష్టాలు మొదలయ్యాయి. దగ్గుబాటి సైలెంట్ అవ్వగా, పురంధేశ్వరి బీజేపీలో చేరారు. రెండుసార్లు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అయినా సరే బీజేపీలో కీలక పదవులు ఇచ్చారు. ఛత్తీస్‌ఘడ్, ఒడిశా రాష్ట్రాల ఇంచార్జ్‌గా నియమించారు. అలాగే ఏపీలో చేరికల కమిటీ ఛైర్మన్‌గా పెట్టారు. బీజేపీలో మంచి ప్రాధాన్యత దక్కినా సరే పురంధేశ్వరి పెద్దగా ఉపయోగించుకున్నట్లు కనబడలేదు.

అందుకే  గత నెలలో ఒడిశా బీజేపి ఇంచార్జ్ పోస్ట్ నుంచి తప్పించి సహ ఇంచార్జ్‌గా కొనసాగిస్తున్నారు. ఇదిలావుండగా తాజాగా ఛత్తీస్‌ఘడ్ బిజేపి ఇంచార్జ్ బాధ్యతల నుంచి కూడా పురందేశ్వరిని తప్పిస్తూ బీజేపి అధిష్టానం నిర్ణయం తీసుకుంది. రేపో మాపో చేరికల కమిటీ పదవి నుంచి కూడా తప్పిస్తారని తెలుస్తోంది. అయితే ఏపీలో చేరికల కమిటే ఛైర్మన్ గా ఉన్నా సరే ఈమె..ఇతర పార్టీల నుంచి నేతలని బీజేపీలోకి తీసుకురావడంలో విఫలమయ్యారు. ముఖ్యంగా టీడీపీ నుంచి పెద్ద ఎత్తున వలసలు వచ్చేలా చేస్తారని భావించారు.

కానీ అది జరగలేదు…అసలు పురంధేశ్వరి టీడీపీ నేతలని బీజేపీలోకి తీసుకొచ్చే కార్యక్రమాలే జరగలేదని తెలుస్తోంది. అంటే టీడీపీని దెబ్బకొట్టడం పురంధేశ్వరికి ఇష్టం లేక ఇలా చేశారా? లేదా అసలు టీడీపీ నుంచి బీజేపీలోకి రావడానికి ఆసక్తి చూపలేదా? అనేది తెలియడం లేదు. మొత్తానికి పురంధేశ్వరి తన పదవికి న్యాయం చేయలేకపోయారు. ఇదే క్రమంలో తన వారసుడు హితేష్‌ని టీడీపీలో చేర్చే కార్యక్రమం చేస్తున్నారని తెలిసింది. అందుకే బీజేపీ…పురంధేశ్వరికి ప్రాధాన్యత తగ్గిస్తూ వచ్చారని తెలుస్తోంది.