తెలుగు సినీ చరిత్రలో ప్రముఖ దేశభక్తి సినిమాలివే…!

ఎందరో మహానుభావులు త్యాగఫలం వల్లే ఈరోజు అఖండ భారతావని స్వేచ్ఛ వాయువులతో విలసిల్లుతోంది. స్వాతంత్ర్యం రావడానికి ఎందరో మహనీయుల అలుపెరగని పోరాటమే కారణం అని నిస్సందేహంగా చెప్పవచ్చు. కొందరు బ్రిటిష్ వారిని బానిసత్వం నుంచి భారతీయులను విడిపించడానికి తమ ప్రాణాలను సైతం త్యాగం చేశారు. ధైర్యసాహసాలతో, శక్తి సామర్థ్యాలతో తెల్లవారిని దేశం నుంచి పారిపోయేలా చేశారు. అయితే మరికొద్ది రోజుల్లో మన భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతుంది. ఈ సందర్భంగా మన తెలుగు ఇండస్ట్రీలో వచ్చిన ప్రముఖ దేశభక్తి సినిమాలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

అల్లూరి సీతారామరాజు (1974)


సూపర్ స్టార్ కృష్ణ హీరోగా మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన సినిమా ఇది. బ్రిటిష్ రాజ్‌కు వ్యతిరేకంగా పోరాటం చేసిన ఈ స్వాతంత్య్ర సమరయోధుడి జీవిత చరిత్రను అల్లూరి సీతారామరాజు సినిమాతో కళ్లకు కట్టినట్టు చూపించారు. వి.రామచంద్రరావు దీనిని డైరెక్ట్ చేశారు. తెలుగు నేలపై పుట్టిన అల్లూరి సీతారామరాజు పోరాటాలు, త్యాగాలు తెలుసుకోవాలంటే ఈ సినిమాని ప్రతి దేశభక్తుడు కచ్చితంగా చూడాల్సిందే.

మన దేశం (1949)


1949లో విడుదలైన మన దేశం సినిమాని స్వాతంత్ర్య ఉద్యమ నేపథ్యంలో తెరకెక్కించారు. ఎల్.వీ ప్రసాద్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో వి.నాగయ్య, సి.హెచ్.నారాయణరావు, కృష్ణవేణి నటించారు. ఘంటసాల సంగీతం సమకూర్చారు. ఫిలిం ఇండస్ట్రీలో ఎన్టీఆర్‌కి ఇది తొలి చిత్రం.

ఆంధ్రకేసరి (1983)

ఆంధ్ర రాష్ట్రానికి మొట్టమొదటి సీఎంగా వ్యవహరించిన తెలుగు స్వాతంత్ర్య సమరయోధుడు టంగుటూరి ప్రకాశం జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమాను తీశారు. విజయచందర్ టంగుటూరి ప్రకాశం పాత్రలో చక్కగా ఒదిగిపోయారు. ఈ సినిమాని ఆయనే డైరెక్ట్ చేసి ఆయనే నిర్మించారు.

బొబ్బిలి పులి (1982)


ఎన్టీఆర్, శ్రీదేవి ప్రధాన పాత్రల్లో నటించిన బొబ్బిలి పులి భారీ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా థియేట్రికల్ రన్‌లో 3.5 కోట్లు వసూలు చేసింది. ఈ మూవీలో ఎన్టీఆర్ మిలటరీ ఆఫీసర్ రోల్ చేశారు. ఈ మిలటరీ ఆఫీసర్ సంఘ వ్యతిరేక శక్తులతో పోరాడుతాడు. చివరికి రాజకీయాల వైపు వెళ్తాడు. ఈ సినిమాలో… “జనని జన్మభూమిశ్చ.. స్వర్గాధపి గరియసి.. ఏ తల్లి నిను కన్నదో.. ఆ తల్లినే కన్న భూమి గొప్పదిరా” అంటూ సాగే ఒక పాట ప్రతి దేశభక్తుడిని కదిలిస్తుంది.

వందేమాతరం (1985)

వందేమాతరం మూవీని విప్లవ దర్శకుడు టి.కృష్ణ తెరకెక్కించారు. ఈ మూవీలో రాజశేఖర్, విజయశాంతి, రాజేంద్ర ప్రసాద్ నటించారు. సమకాలీన సమాజంలోని పరిస్థితుల చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. మహాత్మాగాంధీ గ్రామాలే దేశ సౌభాగ్యానికి కారణమని అన్నారు. అలాంటి గ్రామాలలో ఉన్న రాజకీయ, మత విద్వేషాలు వంటి పరిస్థితులపై ఈ సినిమాని తెరకెక్కించారు.

నేటి భారతం (1983)

ఈ సినిమాకి టి.కృష్ణ కథ అందించడంతోపాటు దర్శకత్వం వహించారు. ప్రజల్లో స్వాతంత్ర్య భావాలు, సమాన ఆర్థిక అవకాశాలు దక్కించుకోవాలని స్ఫూర్తి నింపేలా ఈ సినిమాని తెరకెక్కించారు. ఇదొక మ్యూజికల్ హిట్‌గా కూడా నిలిచింది. ‘మానవత్వం పరిమళించే’ పాట సూపర్ హిట్ అయ్యింది.

సర్దార్ పాపా రాయుడు (1980)


మొదటి భారత స్వాతంత్ర్య సంగ్రామంలో పోరాడిన ఈ రోజుల్లో ఒకరిగా పేరుగాంచిన తిరుగుబాటుదారుడు పాపా రాయుడు జీవితం ఆధారంగా మూవీని తెరకెక్కించారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ అద్భుతంగా నటించారు.

ఖడ్గం (2002)

దేశభక్తిని స్టోరీ లైన్ గా తీసిన సినిమా ఇది. డైరెక్టర్ కృష్ణవంశీ ఈ సినిమా ద్వారా దేశంలో భిన్నత్వం ఉన్నప్పటికీ అందరూ ఒక్కటిగా ఉండాలనే మెసేజ్ ఇచ్చారు. ఇది దేశభక్తి సినిమాల్లో టాప్ ప్లేస్‌లో ఒకటిగా ఉంటుంది.

మహాత్మా (2009)

ఈ రోజుల్లో మహాత్మా గాంధీ ఆలోచనలను, ఆయన చెప్పిన మాటలను పాటిస్తే దేశం ఎలా బాగుపడుతుందో చూపించిన సినిమా ఇది.

భారతీయుడు (1996)

సేనాపతి అనే ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు నేటి సమాజంలోని లంచగొండితనంపై కదం తొక్కితే ఏమవుతుందనేదే భారతీయుడు మూవీ స్టోరీ. శంకర్ దర్శకత్వంలో వచ్చిన మంచి దేశభక్తి సినిమా ఇది.

తొలితరం స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా వచ్చిన సైరా (2019) కూడా దేశభక్తి చిత్రమే. ఇందులో సిపాయిల తిరుగుబాటు కంటే ముందే బ్రిటీష్ రాజ్‌కి వ్యతిరేకంగా పోరాడతాడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. ఇక ఆర్ఆర్ఆర్ (2022), పరమ వీర చక్ర, మేజర్ చంద్రకాంత్, సుభాష్ చంద్రబోస్ నాపేరు సూర్య వంటి చిత్రాలు కూడా దేశభక్తిని చాటేవే!