‘కార్తికేయ 2’ మీద వాళ్ళు నిజంగా ఏడ్చారా? ఆ శాపం వారికి తగిలిందా?

ఇటీవల రిలీజైన సినిమా ‘కార్తికేయ 2’ మంచి టాక్ తో దూసుకుపోతోంది. వాయిదాల మీద వాయిదాలు పడిన సినిమా ఎట్టకేలకు రిలీజై బాక్షాఫీస్ వద్ద సత్తా చాటుతోంది. అయితే పెద్దగా బలమైన కారణాల్లేకుండానే ‘కార్తికేయ-2’ సినిమాకి పదే పదే వాయిదాల సమస్య రావడంతో చిత్ర యూనిట్ తో పాటు, హీరో నిఖిల్ కూడా కాస్త అసహనానికి గురైన విషయం అందరికీ తెలిసినదే. సినీ పరిశ్రమలోని రాజకీయాలు ‘కార్తికేయ-2’ సినిమాని వెనక్కి నెట్టేశాయన్నది ఓ వర్గం వాదన. దీనికి ‘నాకే ఎందుకిలా అవుతోంది.?’ అంటూ ‘కార్తికేయ-2’ హీరో నిఖిల్ ఈ మధ్యనే ఓ సందర్భంలో బాధపడటం దీనికి బలం చేకూర్చింది.

సినిమా అంటేనే ఒక మహా యజ్ఞం. అనేక వ్యవప్రయాసలకోర్చి నిర్మాత, దర్శకుడు, ఆర్టిస్టులు, మిగతా టెక్నీకల్ టీమ్ ఓ తపస్సులా కష్టపడతారు. సరే, వారి శ్రమకు బదులుగా రిలీజు కాబోతుందన్న చివరి నిముషంలో సినిమా వాయిదా పడితే మాత్రం వారి బాధ వర్ణనాతీతం. అయితే అదే సినిమా చివరకు విడుదలై సూపర్ హిట్టై మంచి వసూళ్లు సాధిస్తే మాత్రం వారి బాధ పూర్తిగా తొలగిపోతుంది. ప్రస్తుతం ఆ ఆనందంతోనే కార్తికేయ టీమ్ పండగ చేసుకుంటోంది.

అయితే ఈ సినిమాని వెనక్కి నెట్టేసిన సినీ రాజకీయాలగురించి ఇపుడు కధలుకధలుగా మాట్లాడుకుంటున్నారు. వారికి తగిన శాస్తే జరిగిందని నితిన్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఇకపోతే ఈ సినిమాని వెనక్కి నెత్తిన ‘మాచర్ల నియోజకవర్గం’ ఫలితం అందరికీ తెలిసిందే. అలాగే ఈ సినిమాని వెనక్కినెట్టింది ‘థాంక్యూ’ సినిమా పరిస్థితి కూడా తెలిసినదే. దాంతో ‘కార్తికేయ’ శాపం వాటికి తగిలిందని అంతా అనుకుంటున్నారు. నిఖిల్ అభిమానులు ‘నిన్ను తొక్కేయాలనుకున్నారు.. వాళ్ళే దెబ్బ తిన్నారు..’ అంటూ నిఖిల్‌ని ట్యాగ్ చేస్తూ ట్వీట్లతో హోరెత్తించేస్తున్నారు. ఈ రాజకీయం వెనుక ఓ ప్రముఖ నిర్మాత పేరు లేవనెత్తుతున్నారు. ఏమో మరి.. పెరుమాళ్ళకెరుక!