మునుగోడు రాజ‌కీయం మారిందా… ఆ పార్టీకి భారీ న‌ష్టం త‌ప్ప‌దా ..!

ఎమ్మెల్యే రాజ‌గోపాల రెడ్డి రాజీనామాతో మునుగోడు కాంగ్రెస్ ఖాళీ అయిన‌ట్లేనా..? ఇక అక్క‌డ ఆ పార్టీ పుంజుకోవ‌డం అసాధ్య‌మేనా..? అంటే అవున‌నే స‌మాధానాలు వినిపిస్తున్నాయి. క్యాడ‌ర్ ఉన్నా నేత‌లు హ్యాండివ్వ‌డంతో ఆ లోటును ఇప్ప‌ట్లో పూడ్చ‌డం క‌ష్ట‌మేన‌నే అభిప్రాయాలు ఆ పార్టీ నేత‌లే వెలిబుచ్చుతున్నారు.

రాజ‌గోపాల రెడ్డి కాంగ్రెస్ అధిష్ఠానంపై గ‌త మూడేళ్ల నుంచీ అసంతృప్తిగా ఉన్న విష‌యం తెలిసిందే. ఆ పార్టీలో త‌న‌కు, త‌న కుటుంబానికి స‌రైన ప్రాధాన్యం ఇవ్వ‌డం లేద‌ని.. త‌మ‌ను అవ‌మాన‌ప‌రుస్తున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. న‌ల్ల‌గొండ జిల్లా అంటే కోమ‌టి రెడ్డి బ్ర‌ద‌ర్స్‌.. కోమ‌టి రెడ్డి బ్ర‌ద‌ర్స్ అంటే న‌ల్ల‌గొండ.. అనే అంత‌లా జిల్లాలో త‌మ ప‌ట్టు పెంచుకున్నారు బ్ర‌ద‌ర్స్‌.

వెంక‌ట రెడ్డి యువ‌జ‌న కాంగ్రెస్ నుంచి ప‌ని చేసి ఉమ్మ‌డి జిల్లాలో ప‌లుసార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా గెలుపొందారు. వైఎస్ హ‌యాంలో మంత్రిగా కూడా ప‌నిచేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తెలంగాణ కోసం త‌న మంత్రి ప‌ద‌విని కూడా త్యాగం చేశారు. ఆయ‌న‌ త‌న త‌మ్ముడిని కూడా పార్టీలోకి తీసుకొచ్చారు. రాజ‌గోపాల రెడ్డి 2009లో భువ‌న‌గిరి ఎంపీగా, స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీగా, మునుగోడు ఎమ్మెల్యేగా గెలుపొంది జిల్లాను త‌మ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. మిగ‌తా స్థానాల్లో కూడా వారు సూచించిన వారికే టికెట్లు ద‌క్కేవి.

అయితే.. పీసీసీ అధ్య‌క్ష ప‌ద‌విని త‌మ‌కు కాకుండా రేవంతుకు క‌ట్ట‌బెట్ట‌డంతో వీరిలో ఆగ్ర‌హం క‌ట్ట‌లు తెంచుకుంది. వెంక‌ట రెడ్డి ఏకంగా ఓటుకు నోటు త‌ర‌హాలోనే ప‌ద‌వి కొనుక్కున్నాడ‌ని ఏడాది క్రిత‌మే బ‌హిరంగంగానే వ్యాఖ్యానించారు. రాజ‌గోపాల రెడ్డి కూడా అప్పుడ‌ప్పుడు నిర‌స‌న గ‌ళం వినిపిస్తూనే ఉన్నారు. అప్ప‌టి నుంచీ పార్టీ కార్య‌క్ర‌మాల‌కు వీరు దూరంగానే ఉంటున్నారు. పొన్నాల ల‌క్ష్మ‌య్య‌, రోశ‌య్య‌, ఉత్త‌మ్ అధ్య‌క్షులుగా ఉన్న‌ప్పుడు కూడా వీరి ప్ర‌వ‌ర్త‌న ఇలాగే కొన‌సాగింది.

అయితే.. మిగ‌తా అధ్య‌క్షుల‌ను ఈ సోద‌రులిద్ద‌రూ డ‌మ్మీ చేసి ఒక ఆటాడుకున్నారు. అయితే రేవంత్ రావ‌డంతో దానికి అడ్డుక‌ట్ట ప‌డింది. రేవంతు ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లాలో త‌న వ‌ర్గాన్ని త‌యారు చేసుకుంటున్నారు. ఇది గిట్ట‌ని రాజ‌గోపాల‌రెడ్డి తాజాగా పార్టీని వీడారు. ఆయ‌న పైకి ఎన్ని చెబుతున్నా ప్ర‌ధాన కార‌ణం రేవంతుపై కోప‌మేన‌ని తెలుస్తోంది. నేడో, రేపో స్పీక‌ర్ ను క‌లిసి రాజీనామా ప‌త్రం అంద‌జేయ‌నున్నారు.

అయితే వ‌చ్చే ఉప ఎన్నిక‌ను ఎదుర్కోవ‌డం కాంగ్రెస్ కు పెద్ద స‌వాలుగా మార‌నుంది. ఎందుకంటే రాజ‌గోపాల రెడ్డితో పాటు నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన ముఖ్య నేత‌లంద‌రూ ఆయ‌న వెంట న‌డిచారు. నాంప‌ల్లి, మునుగోడు, చండూరు, నాంప‌ల్లి, చౌటుప్ప‌ల్‌, నారాయ‌ణ‌పూర్ మండ‌లాల అధ్య‌క్షులు, ఒక జ‌డ్పీటీసీ కూడా పార్టీని వీడారు. ఇపుడు ఈ ఖాళీల‌ను పూరించ‌డంతో పాటు క్యాడ‌ర్ చెల్లాచెదురు కాకుండా కాపాడుకోవాల్సిన.. కంచుకోట‌ను నిల‌బెట్టుకోవాల్సిన‌ బాధ్య‌త టీపీసీసీ పెద్ద‌ల‌పై ఉంది. లేదంటే భారీ న‌ష్టం త‌ప్ప‌దు. చూడాలి మ‌రి ఏం జ‌రుగుతుందో..!