పేటలో ఈ సారి హోరాహోరీ..?

గత ఎన్నికల్లో ఆసక్తికర పోరు జరిగిన నియోజకవర్గాల్లో చిలకలూరిపేట కూడా ఒకటి…ఈ స్థానంలో టీడీపీ నుంచి సీనియర్ నేత ప్రత్తిపాటి పుల్లారావు…వైసీపీ నుంచి విడదల రజిని పోటీ చేశారు. రజిని కాకుండా వేరే నేత పోటీ చేసి ఉంటే పేట ఫైట్ పై అంత ఆసక్తికరంగా ఉండేది కాదేమో. ఎందుకంటే టీడీపీలో చేరి…ప్రత్తిపాటి వెనుక రాజకీయం నేర్చుకున్న రజిని…చివరికి అదే ప్రత్తిపాటిపై పోటీకి దిగడంతో..పేట ఫైట్ చాలా ఇంటరెస్టింగ్ గా నడిచింది.

అయితే సీనియర్ అయిన ప్రత్తిపాటిని ఓడించడం రజిని వల్ల కాదని ప్రచారం జరిగింది…కానీ అదంతా నిజం కాదని చెప్పి రజిని నిరూపించారు…అనూహ్యంగా ప్రత్తిపాటిని ఓడించారు…అప్పటివరకు తిరుగులేదనుకునే ప్రత్తిపాటికి ఘోర పరాభవం ఎదురైంది. ఇక తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన రజిని…తక్కువ సమయంలోనే ఏపీ రాజకీయాల్లో మంచి ఫాలోయింగ్ పెంచుకున్నారు. అలాగే జగన్ దృష్టిలో పడి…తొలిసారి మంత్రి పదవి కూడా కొట్టేశారు. ఇలా తక్కువ సమయంలోనే రజిని స్పీడుగా ఎదిగారు. ఇంత ఫాస్ట్ గా ఎదిగిన రజినికి నెక్స్ట్ ఎన్నికల్లో కూడా తిరుగుండదా? అంటే అది మాత్రం ఇప్పుడే చెప్పలేం.

రాజకీయంగా రజిని బలపడిన మాట వాస్తవమే…కానీ అదే సమయంలో ప్రత్తిపాటి సైతం పుంజుకుంటున్నారు. ఈ సారి మాత్రం రజినికి ఈజీగా గెలిచే ఛాన్స్ మాత్రం ఇచ్చేలా కనిపించడం లేదు. పైగా గత ఎన్నికల మాదిరిగా ఈ సారి జగన్ గాలి కూడా అంతగా ఉండకపోవచ్చని తెలుస్తోంది…ఈ నేపథ్యంలో రజిని విజయం అనేది ఈజీగా దక్కేలా లేదు. ఏదేమైనా ఈ సారి చిలకలూరిపేటలో హోరాహోరీ పోరు జరిగేలా ఉంది.