‘విక్రాంత్ రోణ’ రివ్యూ అండ్ రేటింగ్

కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ నటించిన లేటెస్ట్ మూవీ ‘విక్రాంత్ రోణ’ ఇప్పటికే దేశవ్యాప్తంగా మంచి బజ్ ను క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యింది. అత్యంత భారీ బడ్జెట్ మూవీగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లుగా సుదీప్ ప్రకటించడంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఇక భారీ అంచనాలు క్రియేట్ చేసిన ఈ సినిమా నేడు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. మరి విక్రాంత్ రోణ కథ ఏమిటి.. అసలు ఈ సినిమాతో సుదీప్ ఎలాంటి విజయాన్ని అందుకున్నాడు అనేది రివ్యూలో చూద్దాం.

కథ:
కర్ణాటకలోని కొమరట్టు అనే కుగ్రామంలో ఈ సినిమా కథ సాగుతుంది. అక్కడ ఒక పోలీస్ ఆఫీసర్ అనుమానాస్పదంగా మృతి చెందుతాడు. దీంతో ఆ పోలీస్ ఆఫీసర్ మృతి ఎలా జరిగిందో తెలుసుకునేందుకు మరో పోలీస్ ఆఫీసర్ విక్రాంత్ రోణ(సుదీప్) అక్కడి వస్తాడు. అయితే ఈ క్రమంలో అక్కడ జరిగే కొన్ని ఘటనలు ఆయన్ను షాక్ కు గురిచేస్తాయి. కేవలం ఒక పోలీస్ ఆఫీసర్ మాత్రమే కాకుండా, ఆ ఊరిలోని 16 మంది చిన్నారులు కూడా మృతిచెందినట్లుగా తెలుసుకుని అవాక్కవుతాడు. అయితే ఆ చిన్నారుల మరణం విక్రాంత్ రోణ జీవితానికి ముడిపడి ఉందనే సంగతి తెలుసుకుని షాక్ అవుతాడు. అసలు ఆ చిన్నారులు ఎలా మరణించారు? ఆ గ్రామంలో అతీంద్రియ శక్తులు ఏమైనా ఉన్నాయా? అక్కడ జరిగే హత్యలకు సూత్రధారి ఎవరు? అనేది సినిమా కథ.

విశ్లేషణ:
ఒక చక్కటి పాయింట్ ఉంటే, దాన్నే రెండున్నర గంటలపాటు ఆడియెన్స్ సీట్లలో నుండి లేవకుండా కూర్చోబెట్టొచ్చని మరోసారి విక్రాంత్ రోణ సినిమా ప్రూవ్ చేసింది. దర్శకుడు అనూప్ భండారీ తీసుకున్న స్టోరీలైన్ రొటీన్ అయినా, దాన్ని అతడు ఎలివేట్ చేసిన విధానం, వినియోగించిన గ్రాండియర్ విజువల్స్ ఈ సినిమాకు బాగా కలిసొచ్చాయి. ఇక ఈ సినిమా కథనం విషయానికి వస్తే.. ఫస్టాఫ్ లో ఒక ఊరిలో జరిగే హత్యలు, వాటిని ఛేదించే క్రమంలో ఓ పోలీస్ ఆఫీసర్ కూడా మృతి చెందడంతో సినిమా కథ ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. దీంతో ఈ హత్యలకు సంబంధించిన కేసును చేధించేందుకు హీరో సుదీప్ ఎంట్రీ ఇస్తాడు. అక్కడి జనం అతడిని చూసి భయపడతుండటం.. ఆ గ్రామంలో ఏదో జరుగుతుందని తెలుసుకుని అది కనుక్కునే పనిలో హీరోయిన్ తో కలిసి సుదీప్ చేసే అల్లరితో ఫస్టాఫ్ కంప్లీట్ చేశారు. అయితే ఎలాంటి ఇంట్రెస్టింగ్ బ్యాంగ్ లేకుండా ఇంటర్వెల్ రావడంతో సినిమాను చూస్తున్న ఆడియెన్స్ బోర్ ఫీల్ అవుతారు.

ఇక సెకండాఫ్ విషయానికి వస్తే.. హత్యల వెనకాల ఉన్నది ఎవరో కనుక్కునేందుకు యాక్షన్ మోడ్ లోకి మారిపోతాడు సుదీప్. ఈ క్రమంలో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ లు అద్భుతంగా చూపెట్టారు. ముఖ్యంగా వీఎఫ్ఎక్స్ పనితీరు ఈ సినిమాకు కలిసొచ్చిందని చెప్పాలి. అయితే ప్రీక్లైమాక్స్, క్లైమాక్స్ లో వచ్చే ట్విస్టులు ఆడియెన్స్ ను అంతగా థ్రిల్ చేయలేకపోతాయి. చూస్తూ ఉండగానే ఎండ్ టైటిల్ కార్డు కూడా పడటంతో సినిమాలో ఏం జరిగిందో తెలియకుండా అయోమయంగా బయటకు వస్తారు ఆడియెన్స్.

కేవలం గ్రాండియర్ విజువల్స్, గ్రాఫిక్స్, యాక్షన్ సీక్వెన్స్ లతోనే సినిమాను జనాలపై రుద్దాలని చూసిన సుదీప్, ఈ సినిమాలో తన పర్ఫార్మెన్స్ తో కొంతమేర ఆకట్టుకున్నా, సినిమా పరంగా మాత్రం ఆడియెన్స్ ను విసిగించాడని చెప్పాలి.

నటీనటుల పర్ఫార్మెన్స్:
విక్రాంత్ రోణ పాత్రలో సుదీప్ పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉందని చెప్పాలి. ఆయన ఈ సినిమాను తన భుజాలపై సోలోగా మోసాడు. ఇక పవర్ ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ లలో కూడా సుదీప్ తనదైన మార్క్ చూపించాడు. కేమియో పాత్రలో వచ్చిన జాక్వెలిన్ ఫర్నాండెజ్ ప్రేక్షకులను తన అందాల ఆరబోతతో మెప్పిస్తుంది. నిరూప్ భండారీ మొదలుకొని, మిగతా నటీనటులను తెలుగు ఆడియెన్స్ పెద్దగా పట్టించుకోరు.

టెక్నికల్ డిపార్ట్ మెంట్:
దర్శకుడు అనూప్ భండారి తీసుకున్న లైన్ రొటీన్ అయినా దాన్ని ఎగ్జిక్యూట్ చేసిన విధానం పర్వాలేదనిపించింది. అయితే గ్రాండియర్ విజువల్స్, గ్రాఫిక్స్ తోనే సినిమా హిట్ అవుతుందని నమ్మి బొక్కబోర్లా పడ్డాడు ఈ డైరెక్టర్. సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు మేజర్ అసెట్ అని చెప్పాలి. ప్రతి సీన్ ను గ్రాండియర్ గా చూపిస్తూనే, డార్క్ థీమ్ సీన్స్ ను కూడా అత్యద్భుతంగా చూపెట్టారు. అటు మ్యూజిక్ కూడా ఈ సినిమా ప్లస్ అయ్యింది. రక్కమ్మా సాంగ్ తో పాటు బీజీఎం కూడా పనిచేసింది. అయితే ఎడిటింగ్ వర్క్ ఇంకా బాగా చేసుండాల్సింది. ఈ సినిమాలో కనీసం 15 నిమిషాల నిడివి, ఓ పాటకు కత్తెర పడినా పెద్దగా ఎఫెక్ట్ పడేది కాదు. నిర్మాణ విలువలు మాత్రం పీక్స్ లో ఉన్నాయి.

చివరగా:
విక్రాంత్ రోణ – సుదీప్ ఫ్యాన్స్‌కు పండగ.. మిగతావారికి దండగ!

రేటింగ్:
2.25/5.0