ఆ ఒక్క విషయంలో చాలా కోపం వస్తుందంటున్న సాయిపల్లవి

చేసిన మొదటి సినిమాతోనే అసంఖ్యాక తెలుగు ప్రేక్షకులకు అభిమాన తారగా సాయిపల్లవి మారిపోయింది. నెమలి పురి విప్పినట్లు ఆమె చేసే డ్యాన్స్‌కు అభిమానులు సమ్మోహితులై పోతారు. ఇక నటనను కళ్లప్పగించి చూస్తూ ఉండి పోతారు. ఆమె వ్యక్తిత్వానికి జేజేలు కొడతారు. పొట్టి బట్టలు వేసుకోనని తెగేసి చెప్పిన ఆమె, గ్లామర్ పాత్రలను నిర్దంద్వంగా తిరస్కరిస్తోంది. సినిమాలో తన పాత్రకు ప్రాధాన్యత లేకపోతే ఎంత పెద్ద స్టార్ సినిమా అయినా తాను నటించేది లేదంటూ చెబుతోంది. మహిళా ప్రాధాన్యత ఉన్న సినిమాలలో నటిస్తూ లేడీ పవర్ స్టార్ అని పిలిపించుకుంటోంది. ఇటీవల ఆమె ప్రధాన పాత్రలో నటించిన గార్గి సినిమా థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాకు సంబంధించిన ఇచ్చిన పలు ఇంటర్వ్యూలలో ఆమె ఆసక్తికర విషయాలను తెలియజేసింది. దానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

ఎవరికైనా ఎదుటి మనుషులు విసిగిస్తే కోపం వస్తుంది. అయితే తనకు అస్సలు కోపమే రాదని సాయిపల్లవి చెబుతోంది. తన ముఖంపై ఎప్పుడు చిరునవ్వు చెరగదని ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. అయితే ఒకే ఒక సందర్భంలో తనకు అత్యంత అరుదుగా కోపం వస్తుందని వెల్లడించింది. పడుకున్నప్పుడు మధ్యలో ఎవరైనా లేపితే కొంచెం కోపం వస్తుందని పేర్కొంది.

దీంతో పాటు తన చిన్నతనంలో తనకో లవ్ స్టోరీ ఉండేదని తెలిపింది. ఏడవ తరగతిలో తాను ఓ అబ్బాయిని ప్రేమించానని, అతడికి లవ్ లెటర్ కూడా రాశానని తెలిపింది. అయితే ఆ లెటర్ చూసి తనను తన తల్లిదండ్రులు బాగా కొట్టారని గుర్తు చేసుకుంది. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలను ఏ మాత్రం దాపరికం లేకుండా ఆమె ఇంటర్వ్యూలలో చెబుతోంది.