బీజేపీ తెలంగాణ‌ సీఎం ఆయ‌నే.. తేల్చేసిన రాజ‌గోపాల్‌రెడ్డి..!

ఆలూ లేదు చూలూ లేదు కొడుకు పేరు సోమ‌లింగం అట‌. జ‌నం నోట్లో త‌ర‌చూ నానే పాత సామెత‌. ఇపుడు తెలంగాణ బీజేపీ వ్య‌వ‌హారం కూడా అచ్చం అలాగే ఉన్న‌ట్లు క‌నిపిస్తోంది. క్రితం ఎన్నిక‌ల్లో గెలిచింది ఒకే ఒక్క సీటు. ఈసారి మాత్రం 60కి పైగా సీట్లు సాధించి అధికారంలోకి వ‌చ్చేస్తామ‌ని ప‌గ‌టి క‌ల‌లు కంటున్నార‌ని ఆ పార్టీ నేత‌లే చ‌ర్చించుకుంటున్నారు. పైగా అందులో సీఎం అభ్య‌ర్థి ఎవ‌రో కూడా తేలిపోయింద‌ట‌. ఈ విష‌యాన్ని స్వ‌యంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజ‌గోపాల‌రెడ్డి వెల్ల‌డించ‌డం గ‌మ‌నార్హం.

Telangana Congress MLA appears set to join BJP

గ‌త ఎన్నిక‌ల‌తో పోలిస్తే ఈసారి బీజేపీ బ‌లం పుంజుకున్న విష‌యం వాస్త‌వ‌మే. అయితే అది అన్ని జిల్లాల్లో లేదు. గ్రేట‌ర్ హైద‌రాబాద్ ఇంకా రెండు మూడు జిల్లాల్లోనే ఆ పార్టీ కాస్త బ‌లంగా క‌నిపిస్తున్న‌ది. చాలా జిల్లాల్లో ఇప్ప‌టికీ సంస్థాగ‌తంగా బ‌ల‌హీనంగానే ఉంది. చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎమ్మెల్యే స్థాయి అభ్య‌ర్థులే లేరు. హైద‌రాబాద్ లో మోదీ స‌భ జ‌రిగితే ఒక్క‌రూ చేరిన దాఖ‌లాలు లేవు. ఈటెల రాజేంద‌ర్‌, కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డి వంటి ఒక‌రిద్ద‌రు నేత‌లు చేరినా.. రాజ‌గోపాల‌రెడ్డి వంటి వ్యక్తులు చేర‌బోతున్నా అది వారి వ్యాపార ప్ర‌యోజ‌నాల కోస‌మే కానీ బీజేపీ బ‌లోపేతం కోసం కాదు.

బూత్ లెవ‌ల్ స్థాయి నుంచి పార్టీని పైకి లేపి అధికారంలోకి వ‌చ్చే స్థాయి ఈసారికి మాత్రం బీజేపీకి జ‌ర‌గ‌ని ప‌ని. ఇది ఆ పార్టీ అధిష్ఠానానికి కూడా తెలుసు. వాళ్ల ఆశ‌లు.. టార్గెట్లు అన్నీ 2028-29 ఎన్నిక‌ల‌పై పైనే. కాక‌పోతే ఇప్ప‌టి నుంచే త‌మ ప‌ట్టు నిరూపించుకొని కాంగ్రెస్ ను దాటి పైకి వెళ్ల‌డ‌మే త‌మ ల‌క్ష్యంగా విధించుకుంది. ప్ర‌స్తుతం బీజేపీ ఈ మాత్రం ఆశ‌లు పెంచుకుందంటే అది ఆ పార్టీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ చ‌లువే.

Telangana: Congress leader Komatireddy Raj Gopal Reddy likely to join BJP

ఆయ‌న పార్టీ ప‌గ్గాలు చేప‌ట్టిన నాటి నుంచే వ‌రుస ఎన్నికలు రావ‌డం.. గెల‌వ‌డం జ‌రుగుతోంది. ఆయ‌న మొద‌టి, రెండో విడ‌త పాద‌యాత్ర‌లు విజ‌య‌వంతం కావ‌డంతో తాజాగా మూడో విడ‌త‌కు స‌న్న‌ద్ధం అవుతున్నారు. ఒక‌వేళ పార్టీ అధికారంలోకి వ‌స్తే ముఖ్య‌మంత్రి అయ్యే అవ‌కాశం ఆరెస్సెస్ సిద్ధాంతాలు పుణికిపుచ్చుకున్న‌బండి సంజ‌య్ కే ఎక్కువ‌గా ఉంటుంది. లేదా పార్టీలో సీనియ‌ర్లు అయిన కిష‌న్ రెడ్డి, ల‌క్ష్మ‌ణ్ ల‌కు ఇవ్వొచ్చు. అంతే కానీ రాజ‌గోపాల‌రెడ్డి మాట‌లు వింటే మాత్రం న‌వ్వొచ్చేలా ఉంది.

బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్న ఆయ‌న అనుచ‌రుల‌తో సంప్ర‌దింపులు జ‌రుపుతున్నారు. తాజాగా ఒక కార్య‌క‌ర్త‌తో మాట్లాడిన ఆడియో సంచ‌ల‌నంగా మారింది. వ‌చ్చేది బీజేపీ ప్ర‌భుత్వ‌మేన‌ని.. ఆ పార్టీలో చేరితే భ‌విష్యత్ బాగుంటుంద‌ని.. సీఎం అయ్యే అవ‌కాశం త‌న‌కే ఉంటుంద‌ని ఆ ఆడియోలో ఉంది. దీనిపై పెద్ద ఎత్తున సెటైర్లు పేలుతున్నాయి. రాజ‌కీయంగా నిల‌క‌డ‌లేనిత‌నంతో.. త‌న మాట‌ల‌తో ప్ర‌జ‌ల్లో చుల‌క‌న అవుతున్నార‌ని ప‌లువురు చ‌ర్చించుకుంటున్నారు. ఆ పార్టీలో చేరితే ఆయ‌న ప‌రిస్థితి ఎలా ఉంటుందో వేచి చూడాలి.