రేవంత్ అమెరికా ప‌ర్య‌ట‌న వెనుక అంత పెద్ద స్కెచ్ ఉందా..!

టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి అమెరికా ప‌ర్య‌ట‌న‌కు ఎందుకు వెళ్లారు..? ఇందులో వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌న‌మా.. పార్టీకి ఉప‌యోగ‌ప‌డే అంశాలు ఉన్నాయా..? లేదా స‌ర‌దాగా గ‌డ‌ప‌డానికి వెళ్లారా..? అనే దానిపై పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఆయ‌న ప‌ర్య‌ట‌న ర‌క‌ర‌కాల ఊహాగానాల‌కు ఆస్కారం ఇచ్చేలా ఉంది. అయితే దీని వెనుక భారీ స్కెచ్ ఉన్న‌ట్లు తెలుస్తోంది.

కొద్ది రోజుల కింద‌ట రేవంత్ రెడ్డి, పార్టీ మ‌రో ఎంపీ కోమ‌టి రెడ్డి వెంక‌ట రెడ్డి, ప్ర‌చార క‌మిటీ చైర్మ‌న్ మ‌ధుయాష్కీ అమెరికా ప‌ర్య‌ట‌న‌కు వెళ్లారు. జూన్ 1న తెలంగాణ ఆవిర్భావ వేడుక‌ల‌ను అక్క‌డ‌ నిర్వ‌హించారు. ఇందులో అన్ని పార్టీల ప్ర‌ముఖులూ పాల్గొన్నారు. అయితే అంద‌రూ తిరిగి వ‌చ్చేస్తే.. రేవంత్‌, కోమ‌టి రెడ్డి, మ‌ధుయాష్కీ మాత్రం అక్క‌డే ఉండిపోయారు. దీనిపై పార్టీలో అనుమానాలు వ్య‌క్త‌మ‌య్యాయి.

ఎందుకంటే.. ఇటీవ‌ల రాహుల్ గాంధీ చేతుల మీదుగా ప్ర‌క‌టించిన వ‌రంగ‌ల్ డిక్ల‌రేష‌న్ ను ప‌ల్లె ప‌ల్లెకు తీసుకువెళ్లాలని టీపీసీసీ నిర్ణ‌యించింది. మే 21 నుంచి జూన్ 21 వ‌ర‌కు నెల రోజుల పాటు ఘ‌నంగా నిర్వ‌హించాల‌ని.. పార్టీకి చెందిన దాదాపు 400 మంది నేత‌లు అన్ని ఊర్ల‌ను చుట్టుముట్టి రావాల‌ని.. ర‌చ్చ‌బండ కార్య‌క్ర‌మాల ద్వారా రైతుల‌కు ఉప‌యోగ‌ప‌డే డిక్ల‌రేష‌న్ ను వివ‌రించి.. రైతుల‌ను పార్టీకి చేరువ చేయాల‌ని ఆదేశించింది.

అయితే.. మొద‌ట్లో ఈ కార్య‌క్ర‌మం అంతంత మాత్రంగానే జ‌రిగినా.. త‌ర్వాత వేగం పుంజుకుంది. కొంత మంది నేత‌లు ఈ కార్య‌క్ర‌మానికి దూరంగా ఉన్నా.. ద్వితీయ శ్రేణి నేత‌లు ప‌ని కానిచ్చేస్తున్నారు. అలాగే.. ఇటీవ‌ల రాజ‌స్థాన్ లో ఏఐసీసీ నిర్ణ‌యించిన చింత‌న్ శిబిర్ తీర్మానాల‌కు మ‌ద్ద‌తు తెలిపేందుకు రాష్ట్ర స్థాయి చింత‌న్ శిబిర్ ను నిర్వ‌హించారు. సీఎల్పీ నేత భ‌ట్టి విక్ర‌మార్క ఆధ్వ‌ర్యంలో ఈ కార్య‌క్ర‌మం జ‌రిగింది.

టీపీసీసీ అధ్య‌క్షుడి హోదాలో జ‌ర‌గాల్సిన ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌వ‌కుండా రేవంత్ అమెరికాలోనే ఉండ‌డం.. పార్టీ కార్య‌క్ర‌మాల‌ను స‌మీక్షించ‌క‌పోవ‌డం వంటి పరిణామాల‌తో శ్రేణుల్లో సందేహాలు వ్య‌క్త‌మ‌య్యాయి. అయితే రేవంత్ ఇన్ని రోజులూ అమెరికాలో ఉండ‌డం వెనుక పెద్ద వ్యూహ‌మే ఉన్న‌ట్లు తెలుస్తోంది.

కాంగ్రెస్ కు మూల స్తంభం రైతులే. వారిని ఆక‌ట్టుకునేందుకే రైతు డిక్ల‌రేష‌న్ ప్ర‌క‌టించారు. దీన్ని ప‌క్కాగా అమ‌లు చేసేందుకు.. ఇంకా కొత్త కొత్త ప‌ద్ధ‌తుల‌ను తెలుసుకునేందుకు రేవంత్ అమెరికాలో ప్ర‌య‌త్నిస్తున్నారు. డ‌ల్లాస్ లో ఒక రైతు త‌నకున్న ఆరువేల ఎక‌రాల్లో పంట‌ల‌ను ఎలా సాగుచేస్తున్నారో రేవంత్‌, కోమ‌టి రెడ్డి ప‌రిశీలించారు. అలాగే.. ఎన్నారైలు, తెలంగాణ‌లో వారికున్న బంధువుల మ‌ద్ద‌తును కూడ‌గ‌ట్టేందుకు అమెరికాలో వ‌రుస స‌మావేశాలు నిర్వ‌హిస్తున్నారు.

ఇవే కాకుండా.. ఆర్థికంగా కూడా మ‌ద్ద‌తు కోసం రేవంత్ ప్ర‌య‌త్నిస్తున్నట్లు స‌మాచారం. ప‌దేళ్లు అధికారానికి దూర‌మైన కాంగ్రెస్ లోటు బ‌డ్జెట్ తో స‌త‌మ‌త‌మ‌వుతోంది. అసెంబ్లీ ఎన్నిక‌లు పెద్ద ఖ‌ర్చుతో కూడుకున్న‌వి కావ‌డంతో నిధుల స‌మీక‌ర‌ణ‌కు శ్రీ‌కారం చుట్టారట‌. ఎన్నారైలు.. ప్ర‌ముఖ సంస్థ‌ల ప్ర‌తినిధుల‌తో పార్టీ ఫండ్ కోసం చ‌ర్చ‌లు జ‌రిపిన‌ట్లు స‌మాచారం. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చేందుకు అవ‌కాశాలున్న అన్ని మూలాల‌ను రేవంత్ ట‌చ్ చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. చూడాలి మ‌రి ఆయ‌న ప్ర‌య‌త్నాలు ఏ మేర‌కు స‌ఫ‌ల‌మ‌వుతాయో..!