చిరంజీవి కోసం కలెక్టర్ సంబంధాన్నే వద్దనుకున్న సురేఖ.. అప్పుడు ఏం జరిగిందంటే..!

సినిమా సెలబ్రిటీల పెళ్లిళ్లు ఎక్కువ కాలం నిలబడవు అనేది చాలా సార్లు రుజువైంది. పవన్ కల్యాణ్, నాగ చైతన్య, అమీర్ ఖాన్, ధనుష్ ఇలా చెప్పుకుంటూ పోతే విడాకులు తీసుకున్న వారు చాలా మందే ఉన్నారు. అయితే శ్రీకాంత్-ఊహ, మహేష్-నమ్రత.. ఇలా కొందరు మాత్రం పిల్లాపాపలతో సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి-సురేఖ దంపతులు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. సురేఖ, చిరంజీవి 1960లో అంటే 42 ఏళ్ల క్రితం మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. అలా ఒకటైన వీరు ఎంతో అన్యోన్యంగా ఉంటూ ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చారు. వారిలో ఒకరైన రామ్ చరణ్ ఇప్పుడు టాలీవుడ్‌లో టాప్ హీరోగా వెలుగొందుతున్నాడు.

అయితే చిరు పెళ్లి అంత సులువుగా ఏం జరగలేదు. దివంగత హాస్యనటుడు అల్లు రామలింగయ్య తన కుమార్తెను చిరంజీవికి ఇచ్చేముందు ఎన్నో ఆలోచనలు చేశారు. అప్పట్లో అల్లు రామలింగయ్యకి క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఎం.ప్రభాకర్ రెడ్డి చాలా క్లోజ్. అందుకే రామలింగయ్య తన కుటుంబ విషయాలను ప్రభాకర్ రెడ్డితో పంచుకునేవారు. కాగా ఒక రోజు సురేఖ పెళ్లి విషయంలో కూడా ఒక సలహా ఇవ్వాలని తమను అడిగినట్లు ఒక లేటెస్ట్ ఇంటర్వ్యూలో ప్రభాకర్ రెడ్డి సతీమణి చెప్పుకొచ్చారు.

బాగా కష్టపడే మనస్తత్వం, మంచి మనసు, ఎలాంటి చెడు అలవాట్లు లేని, భవిష్యత్తులో గొప్ప స్థాయికి ఎదిగే వాడైన చిరంజీవికి సురేఖని ఇచ్చి పెళ్లి చేయాలా లేక కలెక్టర్ సంబంధం ఖాయం చేస్తే బాగుంటుందా అని రామలింగయ్య ప్రభాకర్ ని ప్రశ్నించినట్లు ఆమె చెప్పారు. అయితే ఇల్లు, ఆస్తి, సొమ్ము, పేరు ఇలాంటి పైమెరుగులు చూసి అమ్మాయిని కట్టబెట్టటం సరికాదని.. అమ్మాయికి ఎవరు నచ్చితే వారికే ఇచ్చి పెళ్లి చేయండి రామలింగయ్య గారు అని ప్రభాకర్ రెడ్డి అన్నారట. దీంతో అల్లు రామలింగయ్య నేరుగా ఇంటికి వెళ్లి సురేఖతో ఈ విషయం గురించి అడగగా తనకి చిరంజీవినే ఇష్టమని సురేఖ కుండబద్దలు కొట్టారు.

దాంతో మరో ఆలోచన లేకుండా తన కూతురిని 27 ఏళ్ల చిరంజీవికి ఇచ్చి ఘనంగా పెళ్లి చేశారు. ఆతర్వాత అల్లు వారి కూతురుగా కాకుండా కొణిదెల వారి కోడలిగా మెగా కుటుంబాన్ని ముందుండి నడిపిస్తూ సురేఖ గొప్ప పేరు తెచ్చుకున్నారు. ఆ విధంగా ఆమె తన మనసుకు నచ్చిన చిరంజీవి కోసం కలెక్టర్ సంబంధాన్నే వద్దనుకున్నారు.