సర్కారు వారి పాట రివ్యూ అండ్ రేటింగ్

సినిమా: సర్కారు వారి పాట
దర్శకుడు: పరశురామ్
నటీనటులు: మహేష్ బాబు, కీర్తి సురేష్, సముద్రఖని, వెన్నెల కిషోర్ తదితరులు
సినిమాటోగ్రఫీ: ఆర్.మాడీ
మ్యూజిక్: థమన్

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన సర్కారు వారి పాట చిత్ర ఎట్టకేలకు నేడు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ తెరకెక్కించడంతో ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిని చూపారు. మరి భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతమేర మెప్పించిందో ఈ రివ్యూలో చూద్దాం.

కథ:
అమెరికాలో హ్యాండ్ లోన్ ఇచ్చే కంపెనీకి ఓనర్‌గా ఉంటాడు మహేష్(మహేష్ బాబు). అప్పు తీసుకున్న వారి దగ్గర్నుండి తిరిగి వసూలు చేయడం మనోడికి వెన్నతో పెట్టిన విద్య. అయితే కళావతి(కీర్తి సురేష్) అనే అమ్మాయి, తాను చాలా కష్టాల్లో ఉన్నానని, చదువుకునేందుకు డబ్బులు అవసరం ఉన్నాయని మహేష్‌ను కన్విన్స్ చేసి అతడి వద్ద డబ్బులు తీసుకుంటుంది. ఆ తరువాత చెప్పాపెట్టకుండా ఇండియా చెక్కేస్తుంది. దీంతో మోసపోయానని తెలుసుకున్న మహేష్, ఆమె దగ్గర్నుండి డబ్బులు వసూలు చేసేందుకు ఇండియాకు పయనమవుతాడు. ఇక్కడ అతడికి ఎదురైన సమస్యలు, కళావతి బ్యాక్‌గ్రౌండ్, ఆమె దగ్గర్నుండి అతడు డబ్బులు వసూలు చేస్తాడా లేడా అనేది సినిమా కథ.

విశ్లేషణ:
ఒక ఫక్తు కమర్షియల్ కథను ప్రేక్షకులు మెచ్చే విధంగా చూపిస్తే, ఆ సినిమాకు జనం బ్రహరథం పడుతుంటారు. అయితే మహేష్ బాబు గతంలో ఇలాంటి సక్సెస్‌లు అందుకున్న దాఖలాలు మనం చూశాం. ఇప్పుడు మరోసారి అలాంటి ఫార్ములాతోనే సర్కారు వారి పాట చిత్రంతో మనముందుకు వచ్చాడు ఈ స్టార్ హీరో. అయితే ఈ సినిమా ఎగ్జిక్యూషన్‌లో అక్కడక్కడ లోపాలు ఉండటంతో అనుకున్న స్థాయిలో సర్కారు వారి పాట ప్రేక్షకులను అలరించలేకపోతుంది.

ఈ సినిమా కథనం విషయానికి వస్తే.. ఫస్టాఫ్ లో హీరో ఇంట్రొడక్షన్ మొదలుకొని, అతడి యాక్షన్ సీక్వెన్స్‌లతో సినిమా కథకు అదిరిపోయే స్టార్ట్ ఇచ్చారు. కానీ కథలోకి వెళ్తున్నా కొద్ది హీరోహీరోయిన్ల మధ్య లవ్ ట్రాక్, అటుపై వచ్చే ఇంటర్వెల్ బ్యాంగ్ సినిమాపై ఆసక్తిని తగ్గిస్తూ వస్తాయి. ఇక ఇంటర్వెల్ బ్యాంగ్ లో హీరోకు ఓ దిమ్మతిరిగే ట్విస్ట్ ఎదురవడంతో సెకండాఫ్‌లో అతడు ఏం చేస్తాడనే ఆసక్తి కాస్త పెరుగుతుంది.

ఇక సెకండాఫ్‌లో ఇండియాకు వచ్చిన హీరోకు ఇక్కడ ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి.. అతడికి కొన్ని నిజాలు తెలియడం.. వాటి వెనకాల అసలు కథలు సినిమాను చాలా స్లోగా చేస్తాయి. ఇక ప్రీక్లైమాక్స్, క్లైమాక్స్‌లో రొటీన్ రొట్టకొట్టుడు సీన్స్ ఈ సినిమాపై ఉన్న ఆసక్తిని పూర్తిగా తగ్గించేస్తాయి. ఇక థియేటర్ బయటకు వచ్చే ఆడియెన్స్‌లో పెద్దగా ఎగ్జైటింగ్ అంశాలు కనిపించకపోవడంతో ఇదొక రొటీన్ సినిమాగా మాత్రమే వారికి గుర్తుండిపోతుంది. ఓవరాల్‌గా ఓ రొటీన్ కమర్షియల్ సినిమాకు ల్యాగింగ్ సీన్స్ మైనస్‌గా మారడం ఈ సినిమాను ఓ యావరేజ్‌గా మిగిలిస్తుంది.

నటీనటులు పర్ఫార్మెన్స్:
మహేష్‌ను చాలా రోజుల తరువాత ఇలాంటి మాస్ అవతారంలో చూపించడంతో అభిమానులు పండగ చేసుకున్నారు. ఇక ఈ సినిమాలో మహేష్ సరికొత్త లుక్ వారికి బాగా నచ్చుతుంది. పర్ఫార్మెన్స్ పరంగా మహేష్ తనదైన యాక్టింగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటాడు. అటు హీరోయిన్ కీర్తి సురేష్‌కు కూడా మంచి పాత్ర పడటంతో ఆమె ఈ సినిమాలో మరోసారి మెరుస్తుంది. ఇక ఈ సినిమాలో మిగతా నటీనటులు వారి పరిధిమేర బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు.

టెక్నికల్ డిపార్ట్‌మెంట్:
దర్శకుడు పరశురామ్ తెరకెక్కించిన సర్కారు వారి పాట చిత్రాన్ని హ్యాండిల్ చేయడంలో ఆయన చాలా వరకు సక్సెస్ అయ్యారు. అయితే ఓ కమర్షియల్ సినిమాకు హీరో ఎలిమెంట్‌తో పాటు కథ కూడా చాలా అవసరం. ఈ విషయంలో దర్శకుడు అక్కడక్కడ తప్పటడుగులు వేశాడు. దీంతో సినిమా కథ పక్కదారి పట్టినట్లు మనకు కనిపిస్తుంది. మాడీ అందించిన సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. థమన్ సంగీతంలో వచ్చిన సాంగ్స్ బాగున్నా, బీజీఎం మాత్రం అనుకున్న స్థాయిలో లేకపోవడం కాస్త నిరాశకు గురిచేస్తుంది. నిర్మాణ విలువలు చాలా రిచ్‌గా ఉన్నాయి.

చివరగా:
సర్కారు వారి పాట – అనుకున్నంత లేదు బేటా!

రేటింగ్:
2.75/5.0