సినిమాల‌ను ఏలేస్తోన్న అన్న‌ద‌మ్ములు వీళ్లే…!

సినీ రంగం అంటేనే రంగుల ప్రపంచం. వెండితెరపై ఒక్క చిన్న పాత్రలో మెరిసినా ఎంతో గుర్తింపు వస్తుంది. ముఖ్యంగా బయట ఎక్కడైనా అభిమానులు గుర్తుపట్టి నానా హంగామా చేస్తుంటారు. అందులోనూ స్టార్‌హీరోలు అయితే చెప్పక్కర లేదు. అడుగు తీసి అడుగు వేయడం కూడా కష్టంగా ఉంటుంది. అందుకే స్టార్ హీరోలు ఎక్కడికెళ్లినా బాడీగార్డులు ఉంటారు. హీరోలను సంరక్షిస్తుంటారు. ఇక ఒకే కుటుంబం నుంచి వచ్చి సత్తా చాటిన నటీనటులు చాలా మందే ఉన్నారు. తెలుగులోనే కాకుండా, కన్నడ, తమిళ, హిందీ, మలయాల చిత్రాల్లో అన్నదమ్ములు సినిమాపై విశేష ప్రభావం చూపారు. అలాంటి వారిలో కొందరి గురించి తెలుసుకుందాం.

తెలుగు సినిమాలో మెగాస్టార్ చిరంజీవి ప్రస్థానం స్పూర్తిదాయకం. ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి, అశేష అభిమానులను సొంతం చేసుకున్న ఆయన సేవా కార్యక్రమాల్లోనూ తనదైన ముద్ర వేశారు. ఆయన మొదటి తమ్ముడు నాగబాబు సినిమాల్లో సహాయక పాత్రలు చేస్తూనే, నిర్మాతగానూ రాణిస్తున్నారు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టార్ డమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సినిమాలు ఎన్ని ప్లాఫ్ అయినా అభిమానుల్లో క్రేజ్ ఏ మాత్రం తగ్గదు. ఇటీవల కాలంలో ఆయన నటించిన వకీల్ సాబ్, భీమ్లానాయక్ చిత్రాలు మంచి వసూళ్లను సాధించాయి. ఇక వీరి కుటుంబంలోనే చిరు కొడుకు రామ్ చరణ్, నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నారు.

ఆ తర్వాత నందమూరి కుటుంబంలో దివంగత హరికృష్ణ చాలా సినిమాల్లో హీరోగా నటించారు. ఆయన సోదరుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ నేటికీ ఎన్నో హిట్ చిత్రాలను ప్రేక్షకులకు అందిస్తున్నారు. సినీ హీరోగా ఆయన చెప్పే డైలాగ్‌లకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతుంటారు.

వీరి తర్వాత దగ్గుబాటి కుటుంబం గురించి చెప్పుకోవచ్చు. అన్న సురేష్ బాబు నిర్మాతగా వ్యవహరిస్తుంటే, కుటుంబ కథా చిత్రాల హీరోగా వైవిధ్యమైన నటనతో వెంకటేష్ ఆకట్టుకుంటున్నారు. మల్టీస్టారర్ చిత్రాలలో నటిస్తూ ప్రేక్షకులతో ఈ నాటికీ కన్నీళ్లు పెట్టించడంలో వెంకటేష్ సిద్ధహస్తుడు. ఇటీవల కాలంలో విడుదలైన నారప్ప, దృశ్యం 2 వంటి చిత్రాలు ఆయన స్టామినా ఏంతో తెలియజేశాయి. వారి కుటుంబంలోనే దగ్గుబాటి రానా పలు తెలుగు సినిమాలతో పాటు పలు దక్షిణాది, బాలీవుడ్ చిత్రాల్లో నటించారు. ఆయన తమ్ముడు దగ్గుబాటి అభిరామ్ కూడా త్వరలో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానున్నాడు.

ఇక ఘట్టమనేని కుటుంబంలో సూపర్ స్టార్ కృష్ణ వారసులుగా రమేష్ బాబు, మహేష్ బాబు సినిమాల్లోకి అడుగు పెట్టారు. మొదట్లో హీరోగా అలరించి రమేష్ బాబు తదనంతర కాలంలో నిర్మాతగా కొనసాగారు. ఇటీవలే ఆయన కాలం చేశారు. ఇక మహేష్ బాబు వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు. త్వరలో రాజమౌళి దర్శకత్వంలో ఆయన భారీ సినిమాలో నటించనున్నారు.

నందమూరి కుటుంబంలోనే హరికృష్ణ వారసులుగా సినీ రంగంలోకి అడుగు పెట్టారు జూ.ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్. ఓ వైపు హీరోగా సినిమాలు చేస్తూనే నిర్మాతగానూ కళ్యాణ్ రామ్ ఆకట్టుకుంటున్నారు. ఇక జూ.ఎన్టీఆర్ అయితే తనదైన నటన, డ్యాన్స్‌లతో బాలీవుడ్ సైతం అవాక్కయ్యేలా తన సత్తా ఆర్ఆర్ఆర్ ద్వారా తెలియజెప్పాడు.

డ్యాన్స్, నటనలో ఎంతో విశేషమైన ప్రతిభను కనబరుస్తాడు అల్లు అర్జున్. మొదట్లో మెగా కాంపౌండ్ హీరోగా ప్రేక్షకులకు పరిచయమైనా, అల్లు వారి హీరోగా తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్‌ను కలిగి ఉన్నాడు. పుష్ప చిత్రం ద్వారా ప్రస్తుతం ఆయన పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. ఆయన అన్న అల్లు బాబీ నిర్మాతగా నిలదొక్కుకుంటున్నారు. ఆయన తమ్ముడు అల్లు శిరీష్ వరుస సినిమాలు చేస్తూ, సరైన హిట్ కోసం నిరీక్షిస్తున్నారు.

అక్కినేని కుటుంబంలో నాగార్జున వారసులుగా నాగచైతన్య-అఖిల్ ప్రేక్షకులకు సుపరిచితమే. తెలుగులో ఎన్నో సినిమాల్లో తమదైన నటనతో ఆకట్టుకుంటున్న వీరు త్వరలో బాలీవుడ్ సినిమాలలో కూడా కనిపించనున్నారు.

మెగా కాంపౌండ్‌లో చిరు మేనళ్లుళ్లు సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ చక్కని చిత్రాలతో అలరిస్తున్నారు. డెబ్యూ మూవీలోనే వైష్ణవ్ తేజ్ ఉప్పెన సినిమాతో హిట్ కొట్టాడు. విలక్షణ దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో కొండపొలం సినిమా ద్వారా కూడా అలరించాడు. ఇక ఆయన కంటే ముందుగానే తెలుగు తెరకు సాయి ధరమ్ తేజ్ పరిచయం అయ్యాడు. మేనమామల వారసత్వాన్ని అందిపుచ్చుకుని వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు.

యూత్ ఫుల్ సెన్సేషన్ విజయ్ దేవరకొండకు బాలీవుడ్ ప్రముఖులు కూడా అభిమానులే. చాలా మంది బాలీవుడ్ హీరోయిన్లు ఆయన సరసన నటించాలని ఉవ్వీళ్లూరుతుంటారు. ప్రస్తుతం లైగర్, జనగణమన చిత్రాల ద్వారా పాన్ ఇండియా స్టార్‌గా ఆయన మారిపోయాడు. ఆయన తమ్ముడు ఆనంద్ దేవరకొండ కూడా విలక్షణ కథలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు.

ప్రముఖ దర్శకుడు ఈవీవీ తనయులు రాజేష్-అల్లరి నరేష్ కూడా హాస్య చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ప్రస్తుతం రాజేష్ ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నా, వరుస సినిమాలతో అల్లరి నరేష్ ప్రేక్షకులను పలకరిస్తున్నారు. మరికొంత మంది అన్నదమ్ములు కూడా సినీ తెరకు సుపరిచితమే.

సాయికుమార్, రవి శంకర్ వంటి వారు హీరోలుగా, నటులుగానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్టులుగా కూడా రాణిస్తున్నారు. ఇక మాస్ మహారాజా రవితేజతో పాటు ఆయన సోదరులు భరత్, రఘులు కూడా నటులుగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. కమెడియనల్ అలీతో పాటు ఆయన సోదరుడు ఖుయ్యుం కూడా తెలుగు సినిమాల్లో ప్రేక్షకులను అలరిస్తున్నారు.