వైసీపీలో ఆ ప‌ది మంది అదృష్టవంతులు ఎవ‌రు.. ?

మంత్రి వ‌ర్గ మార్పు. కొన్నాళ్లుగా ఏపీలో జ‌రుగుతున్న పెద్ద చ‌ర్చ‌. అయితే.. అంద‌రినీ మార్చేస్తార‌ని.. కొన్నాళ్ల కింద‌ట‌.. సీఎం జ‌గ‌న్‌కు బంధువు, కీల‌క నేత అయిన‌ మంత్రి బాలినేని శ్రీనివాస‌రెడ్డి చెప్పుకొచ్చారు.. తాజాగా మాత్రం దీనికి విరుద్ధంగా సంకేతా లు వ‌స్తున్నాయి. పూర్తిగా కాకుండా.. కొంద‌రిని మాత్ర‌మే మంత్రి మండ‌లి నుంచి త‌ప్పిస్తార‌ని.. అంటున్నారు. ఈ క్ర‌మంలో ఎవ‌రెవ‌రు ప‌క్క‌కు త‌ప్పుకొంటారు? ఎవ‌రు కొన‌సాగుతారు? అనే చ‌ర్చ ఓవైపు సాగుతుంటే.. కేవ‌లం ప‌ది మందికే చాన్స్ ద‌క్కుతుంద‌ని మ‌రికొంద‌రు అంటున్నారు. ఈ నేప‌థ్యంలో ఆ ప‌ది మంది అదృష్ట వంతులు ఎవ‌రు? అనే చ‌ర్చ జోరుగా సాగుతోంది.

ప్ర‌స్తుతం ఆశావ‌హుల జాబితాలో జూనియ‌ర్లు, సీనియ‌ర్లు ఇద్ద‌రూ కూడా పోటీప‌డుతున్నారు. నిజానికి సీనియ‌ర్ల కంటే కూడా జూనియ‌ర్లు.. చేస్తున్న ప్ర‌య‌త్నాలు ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో ఎవ‌రికి జ‌గ‌న్ అవ‌కాశం క‌ల్పిస్తారు? అనేది ఆస‌క్తిగా క‌నిపిస్తోంది. ప్ర‌స్తుతం ఉన్న అంచ‌నాల ప్ర‌కారం.. గుంటూరు నుంచి ఒక లేడీకి.. కృష్ణాజిల్లా నుంచి మ‌రో బీసీ ఫైర్ బ్రాండ్ నాయ‌కుడికి అవ‌కాశం ద‌క్కుతుంద‌ని అంటున్నారు.

ఇక‌, ప్ర‌స్తుతం ఆయా జిల్లాల్లో ఉన్న వారిని కొన‌సాగిస్తార‌నే వాద‌న వినిపిస్తోంది. ప్ర‌స్తుతం జిల్లాల సంఖ్య పెరుగుతున్న నేప‌థ్యంలో ఒక్కొక్క జిల్లా నుంచి ఒక్కొక్కరికి అవ‌కాశం క‌ల్పించే ఛాన్స్ ఉంద‌ని అంటున్నారు. ఇక‌, అదేస‌మ‌యంలో పార్టీకి అండ‌గా ఉంటున్న సీనియ‌ర్ల‌కు కూడా అవ‌కాశం ల‌భిస్తుంద‌ని అంటున్నారు. చిత్తూరు జిల్లా నుంచి చెవిరెడ్డి భాస్క‌ర రెడ్డి కానీ, భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డికి కానీ, ఛాన్స్ ఉంటుంద‌ని అంటున్నారు.. ఇక‌, ఎప్ప‌టి నుంచో మంత్రి ప‌ద‌విని ఆశిస్తున్న న‌గ‌రి ఎమ్మెల్యే రోజాను.. జిల్లాకు ఇంచార్జ్‌ను చేస్తార‌ని.. గుస‌గుస వినిపిస్తోంది.

క‌డ‌ప నుంచి అంజాద్ బాషాను ప‌క్క‌న పెట్టి.. గుంటూరు తూర్పు నుంచి విజ‌యం ద‌క్కించుకున్న మైనారిటీ నేత‌కు అవ‌కాశం ఇస్తార‌ని చెబుతున్నారు. ఎందుకంటే.. గుంటూరులో బ‌ల‌మైన టీడీపీ వ‌ర్గాన్ని ఎదుర్కొనేందుకు.. ఈ నేత‌ల‌కు అవ‌కాశం ఇవ్వాల‌ని భావిస్తున్నారు. శ్రీకాకుళం నుంచి రెడ్డి శాంతికి ఖ‌చ్చితంగా ఛాన్స్ ల‌భిస్తుంద‌ని అంటున్నారు. ఇలా.. మొత్తంగా 10 మంది వర‌కు కొత్త ముఖాల‌కు ఛాన్స్ ఉంటుంద‌ని అంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.