ఏపీ పాలిటిక్స్‌పై ఐదు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ ఎఫెక్ట్..!

దేశ‌వ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు సంబంధించి ఎన్నిక‌ల రిజ‌ల్ట్ వ‌చ్చేందుకు మ‌రో రెండు రోజుల స‌మ‌యం ఉంది. అయితే.. ఇప్ప‌టికే ఎగ్జిట్ పోల్ ఫ‌లితం వ‌చ్చేసింది. దీనిలో యూపీ లో బీజేపీనే మ‌ళ్లీ అధికారంలోకి రావ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు. అంతేకాదు.. ఇత‌ర రాష్ట్రాల్లోనూ బీజేపీ బ‌లోపేతం కానుండ‌డం మంచి సంకేతాలుఇస్తోంద‌ని.. బీజేపీ నాయ‌కులు అంటున్నారు. అయితే.. ఈ ఎగ్జిట్ పోల్ ఫ‌లితం.. ఏపీకి అనుకూలంగా ఉండ‌డంపైనే చ‌ర్చ సాగుతుండ‌డం గ‌మ‌నార్హం.

ఎందుకంటే.. కేంద్రంలో బీజేపీ ఉండాల‌ని కోరుకునే పార్టీల్లో జ‌గ‌న్ అత్యంత కీల‌కమైన నాయ‌కుడు. సో.. బీజేపి కేంద్రంలో ఉంటే.. ఏపీకి సంబంధించిన స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించుకునే అవ‌కాశం ఉంటుంది. పైగా ఆయ‌న వ్య‌తిరేకించే కాంగ్రెస్ బ‌లోపేతం అయితే.. ఆయ‌న‌కు ఇబ్బందులు త‌ప్ప‌వు. అందుకే.. కేంద్రంలో బీజేపీ బ‌లంగా ఉండాల‌ని భావిస్తారు. ఇప్పుడు ఎగ్జిట్ పోల్‌లో బీజేపీకి సానుకూల సంకేతాలు వ‌చ్చాయి.

ఈ నేప‌థ్యంలో బీజేపీ వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించి.. వ‌చ్చే సార్వ‌త్రికంలోనూ.. స‌త్తా చూపించే ఛాన్స్ ఖ‌చ్చితంగా క‌నిపిస్తోంది. కేంద్రంలో బీజేపీఉంటే.. రాష్ట్రంలో వైసీపీ మ‌రింత బ‌లంగా ఉండేందుకు.. ఏపీకి అవ‌స‌ర‌మైనవి సాధిం చుకునేందుకు కూడా అవ‌కాశం ఉంటుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. అందుకే.. కేంద్రంలో బీజేపీ బ‌లంగా ఉండాల‌ని కోరుకుంటున్నారు జ‌గ‌న్‌. ఎగ్జిట్‌పోల్ లో బీజేపీ పుంజుకోవ‌డం వైసీపీకి సానుకూలంగా ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

మ‌రోవైపు.. ఈ ఎగ్జిట్‌పోల్ ఫ‌లితం.. తెలంగాణ అధికార పార్టీ టీఆర్ ఎస్‌లో క‌ల‌క‌లం రేపింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఎందుకంటే.. కేంద్రంలో బీజేపీ బ‌ల‌హీన ప‌డితే.. త‌ప్ప‌.. కేసీఆర్ వ్యూహం స‌క్సెస్ అయ్యేలా క‌నిపించ‌డం లేదు. ఈ నేప‌థ్యంలో తాజాగా వ‌చ్చిన ఎగ్జిట్ ఫ‌లితం.. కేంద్రంలో బీజేపీ పుంజుకునేలా క‌నిపిస్తున్న నేప‌థ్యంలో కేసీఆర్‌కు ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని అంటున్నారు.